సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు.. ఇంటర్ బోర్డు హెచ్చరిక
ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ | జూలై 18, 2026 | నిజం న్యూస్
ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేస్తే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) హెచ్చరించింది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు కోరిన వెంటనే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), కండక్ట్ సర్టిఫికేట్, బోనాఫైడ్, మార్కుల మెమోలు, ఇతర విద్యా సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆలస్యం చేయకుండా అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఫీజుల చెల్లింపులకు సంబంధించిన వివాదాలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, కానీ విద్యార్థుల విద్యా భవిష్యత్తును బందీగా పెట్టి సర్టిఫికెట్లు నిలిపివేయడం చట్టవిరుద్ధమని బోర్డు పేర్కొంది. ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు వంటి అంశాల్లో సర్టిఫికెట్లు అత్యంత కీలకమని, వాటిని నిలిపివేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది.
విద్యార్థుల ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత కళాశాలలపై విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే అనుబంధ గుర్తింపును రద్దు చేయడం, కళాశాల మూసివేత వరకు చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ విద్యా మండలి స్పష్టం చేసింది.
ఇలాంటి ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు లేదా ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి విద్యా భవిష్యత్తుకు ఆటంకం కలగనివ్వబోమని వెల్లడించారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



