ఎలాగైనా నా భర్తను చంపు.. లేదంటే నేను చనిపోతా

తన భార్య భవానీ, సైదులు అనే వ్యక్తితో కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ గాదె రాజేశ్వరరావు డోర్నకల్ పోలీసులను ఆశ్రయించారు.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర?

భార్య చాటింగ్‌ స్క్రీన్‌షాట్లతో పోలీసులను ఆశ్రయించిన భర్త.. డోర్నకల్‌లో జీరో ఎఫ్‌ఐఆర్

డోర్నకల్, ఆగస్టు 7 (నిజం న్యూస్): భర్తను హత్య చేయాలని ప్రియుడిని కోరుతూ భార్య పంపినట్లు చెబుతున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు వెలుగులోకి రావడం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కలకలం రేపింది. తన భార్య భవానీ, సైదులు అనే వ్యక్తితో కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ గాదె రాజేశ్వరరావు డోర్నకల్ పోలీసులను ఆశ్రయించారు.

 

రాజేశ్వరరావు ఫిర్యాదు ప్రకారం.. 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానీతో ఆయనకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్న సమయంలో భార్య ప్రవర్తనలో మార్పు గమనించినట్లు ఆయన తెలిపారు.

 

ఖమ్మం నగరంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులుతో తన భార్యకు పరిచయం ఏర్పడి, అది సన్నిహిత సంబంధంగా మారిందని రాజేశ్వరరావు ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అడ్డంకిగా భావించి భార్య, సైదులు కలిసి తనను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు.

 

గత నెల 27న భార్యకు సైదులుతో సంబంధం ఉన్న విషయం తనకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు రాజేశ్వరరావు తెలిపారు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సైదులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం భార్య ఫోన్‌ను పరిశీలించగా, తనను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని భవానీ సైదులుకు పంపినట్లు చెబుతున్న సందేశాలను గుర్తించినట్లు తెలిపారు.

 

ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లతో పాటు ఇతర ఆధారాలను సేకరించి పోలీసులకు సమర్పించినట్లు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తనకు, తన ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

 

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన ఘటనలు ఖమ్మం పరిధిలో జరిగినట్లు సమాచారం. దీంతో డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అనంతరం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ, ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

శ్రీనివాస్ నాయక్,

స్టేట్ బ్యూరో,

నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button