బాయ్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు ఇస్తామంటూ భారీ మోసం!

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో “50% OFF”, “రెంట్ బాయ్‌ఫ్రెండ్ – యువర్ పర్సనల్ కంపానియన్” అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లు కనిపిస్తున్నాయి. కాఫీ మీటింగ్, సినిమా డేట్, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా రావడం వంటి సేవల పేరుతో వివిధ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు.

50% ఆఫర్ అంటూ అమ్మాయిలకు సైబర్ వల!

ఆగస్టు 8, 2026 | నిజం న్యూస్

హైదరాబాద్: సోషల్ మీడియాలో “రెంట్ బాయ్‌ఫ్రెండ్” పేరుతో ప్రచారం అవుతున్న ఆకర్షణీయమైన ఆఫర్ల పట్ల అమ్మాయిలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 శాతం డిస్కౌంట్ అంటూ ప్రచారం చేస్తున్న ఈ ప్రకటనల వెనుక సైబర్ మోసగాళ్ల వల ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో “50% OFF”, “రెంట్ బాయ్‌ఫ్రెండ్ – యువర్ పర్సనల్ కంపానియన్” అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లు కనిపిస్తున్నాయి. కాఫీ మీటింగ్, సినిమా డేట్, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా రావడం వంటి సేవల పేరుతో వివిధ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు.

ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు రూ.1,999, ఫుల్‌డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ ధరలను చూపిస్తూ యువతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటోలు ఆకర్షణీయం.. వెనుక మోసం!

కేటుగాళ్లు ఏఐతో రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువకుల ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రొఫైళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆసక్తి చూపిన వారితో మొదట తియ్యటి మాటలతో చాటింగ్ ప్రారంభించి, నమ్మకం కలిగించిన తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ వంటి పేర్లతో డబ్బులు అడుగుతారు.

యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు పంపించిన తర్వాత బాధితులను బ్లాక్ చేసి మోసం చేసే అవకాశం ఉంది. కొందరి నుంచి వ్యక్తిగత సమాచారం, ఫోన్ నంబర్లు, ఫొటోలు సేకరించి అనంతరం బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ప్రమాదం కూడా ఉంది.

అపరిచితులను నేరుగా కలవొద్దు

సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను పూర్తిగా నమ్మి ఒంటరిగా కలవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు చెల్లించే ముందు ఆ వ్యక్తి లేదా సంస్థ నిజమైనదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్లు, యూపీఐ చెల్లింపులకు దూరంగా ఉండాలి.

తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి

యువత సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి ఆఫర్లకు స్పందిస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి తొందరపడి వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు.

ఇలాంటి అనుమానాస్పద ప్రకటనలు కనిపించినా, సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలి. అలాగే cybercrime.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

అపరిచితుల మాటలను నమ్మి డబ్బులు చెల్లించకండి.. వ్యక్తిగత వివరాలు పంచుకోకండి.. ముందుగా జాగ్రత్తే సైబర్ మోసాల నుంచి రక్షణ!

-శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో

నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button