ఆగస్టు 16లోగా LPG e-KYC పూర్తి చేయండి.. లేదంటే సబ్సిడీకి బ్రేక్!
e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో LPG సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అయితే అలాంటి సందర్భంలో కమర్షియల్ LPG ధర వర్తిస్తుందా అనే అంశంపై స్పష్టత లేదు.

నిజం న్యూస్ | ఆగస్టు 7, 2026
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. LPG కనెక్షన్‌కు సంబంధించి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC ప్రక్రియను 2026 ఆగస్టు 16లోగా పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు సూచించాయి. ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వారికి ఈ గడువు వర్తించదు.
గడువులోగా e-KYC పూర్తి చేయని ఉజ్వల లబ్ధిదారులు LPG సబ్సిడీ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గడువు ముగిసిన తర్వాత సబ్సిడీ ధరకు గృహ వినియోగ LPG సిలిండర్ పొందే అర్హతపై ప్రభావం పడవచ్చని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థలు వినియోగదారులకు సందేశాలు పంపినట్లు సమాచారం.
రూ.300 సబ్సిడీ.. రీఫిల్లులపై పరిమితి
ప్రస్తుతం ఉజ్వల పథకం కింద 14.2 కిలోల LPG సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీ అందుతోంది. అయితే ఈ ఏడాది సబ్సిడీ వర్తించే రీఫిల్లుల సంఖ్యను గతంలో ఉన్న 9 నుంచి 4 రీఫిల్లులకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో LPG సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అయితే అలాంటి సందర్భంలో కమర్షియల్ LPG ధర వర్తిస్తుందా అనే అంశంపై స్పష్టత లేదు.
ఎలా e-KYC పూర్తి చేయాలి?
లబ్ధిదారులు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్కు సంబంధించిన మొబైల్ యాప్‌ల ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా డెలివరీ సిబ్బంది సహాయంతో కూడా ఆధార్ బయోమెట్రిక్ e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసి ఉన్నట్లయితే, e-KYC పూర్తి చేయడానికి ముందు ఆధార్ బయోమెట్రిక్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
కాబట్టి ఉజ్వల పథకం లబ్ధిదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, తమ LPG కనెక్షన్‌కు e-KYC పూర్తయిందో లేదో ఒకసారి నిర్ధారించుకుని, అవసరమైతే ఆగస్టు 16లోగా e-KYC పూర్తి చేసుకోవడం మంచిది.
_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



