బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం

17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

మైనర్ బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు.. హనీ ట్రాప్ ఆరోపణలతో బండి సంజయ్ వర్గం ప్రతివాదం*

 

హైదరాబాద్: మే 09

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

ఫిర్యాదు ప్రకారం, 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

 

ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద బండి సాయి భగీరధ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు బాధితురాలి వాంగ్మూలం, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, మెడికల్ సంబంధిత వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

 

ఇక బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తెపై మానసిక ఒత్తిడి పెరగడంతో రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

 

అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్ వర్గం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపిత “హనీ ట్రాప్” వ్యవహారమని, తమ వద్ద నుంచి రూ.5 కోట్ల డిమాండ్ చేశారని చెబుతున్నారు. రాజీ ప్రయత్నాల్లో భాగంగా రూ.50 వేల రూపాయలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

 

అయితే “ఎలాంటి తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చారు?” అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఈ అంశంలో నిజానిజాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

 

ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

_శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button