ఫిట్‌నెస్ లేని నాలుగు బస్సులు సీజ్..మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు
తనిఖీల్లో ఫిట్‌నెస్ నిబంధనలు పాటించని నాలుగు స్కూల్ బస్సులను గుర్తించిన అధికారులు వెంటనే వాటిని సీజ్ చేశారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమనే సందేశాన్ని జిల్లా రవాణా శాఖ స్పష్టంగా తెలియజేసింది.

పిల్లల భద్రతే లక్ష్యం.. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు
ఫిట్‌నెస్ లేని నాలుగు బస్సులు సీజ్.. రవాణా అధికారి శంకర్ నాయక్ కఠిన చర్యలు
మహబూబాబాద్, జూన్ 15, 2026 (నిజం న్యూస్):
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకొని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ నిబంధనలు పాటించని నాలుగు స్కూల్ బస్సులను గుర్తించిన అధికారులు వెంటనే వాటిని సీజ్ చేశారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమనే సందేశాన్ని జిల్లా రవాణా శాఖ స్పష్టంగా తెలియజేసింది.
జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ రవాణా నిబంధనల అమలులో కఠిన వైఖరిని ప్రదర్శించడం ప్రశంసనీయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతన విద్యా సంవత్సరం మొదటి రోజే స్వయంగా రంగంలోకి దిగి పాఠశాల బస్సుల తనిఖీలు చేపట్టడం ద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచారని స్థానికులు కొనియాడుతున్నారు.
స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, డ్రైవర్ అర్హతలు, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.
ఈ తనిఖీల్లో ఏ మహేందర్ ఎంవీఐ, కాసిం సాహెబ్ ఏఎంవీఐ, వెంకట్ రెడ్డి ఏఎంవీఐతో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



