రవాణాశాఖలో అవినీతిపై ఉక్కుపాదం. లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌.!

‘కోడ్‌’ల వాడకానికి చెక్‌.. ఏజెంట్ల ప్రవేశంపై నిషేధం సీసీ కెమెరాలు పనిచేయకపోయినా చర్యలు తప్పవు – విజిలెన్స్‌ జేటీసీ చంద్రశేఖర్‌ గౌడ్‌ కీలక ఉత్తర్వులు

హైదరాబాద్‌, నిజం న్యూస్ జూన్‌ 17:

రాష్ట్ర రవాణాశాఖలో అవినీతి, దళారుల వ్యవస్థ, సిబ్బంది మధ్య రహస్య ‘కోడ్‌’ల వినియోగంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. శాఖలో పారదర్శకత పెంపు, అవినీతి నిర్మూలన లక్ష్యంగా రవాణాశాఖ విజిలెన్స్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం. చంద్రశేఖర్‌ గౌడ్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకున్నా, వారికి సహకరించినా సంబంధిత సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

 

ఇటీవల రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలపై సీఎం కార్యాలయం (CMO) ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌, రిజిస్ట్రేషన్‌ తదితర సేవల్లో దళారుల ప్రమేయం పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ బృందాల తనిఖీలకు ముందుగానే సమాచారం అందించేందుకు కొందరు సిబ్బంది కోడ్‌ పదాలు, సంకేతాలు, నంబర్‌ సీక్వెన్స్‌లు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణాశాఖ కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో పలు కీలక మార్పులు అమలు చేయాలని ఆదేశించారు. డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి నిర్ణీత తేదీన తప్పనిసరిగా ట్రాక్ వద్ద హాజరుకావాలని, పరీక్షకు ముందు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో అభ్యర్థి గుర్తింపును స్వయంగా ధ్రువీకరించాలని స్పష్టం చేశారు.

 

డ్రైవింగ్ టెస్ట్‌లలో నామమాత్రపు పరీక్షలకు ఇక ముగింపు పలుకుతూ, అభ్యర్థులు వాహనాన్ని స్టార్ట్ చేయడం నుంచి రివర్స్‌, లేన్‌ డిసిప్లిన్‌, ట్రాఫిక్ నియమాల పాటింపు, వాహన నియంత్రణ వంటి అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేవలం స్టీరింగ్ వద్ద కూర్చోబెట్టి లేదా కొద్ది దూరం నడిపించి లైసెన్స్ మంజూరు చేసే విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు.

 

ఇకపై ప్రతి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద “ప్రైవేట్ ఏజెంట్లకు ప్రవేశం నిషేధం” అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రైవింగ్ ట్రాక్‌లు, రవాణాశాఖ కార్యాలయాల్లో బ్రోకర్లు, ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.

 

అత్యంత కీలకంగా, కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, అవి పనిచేయకపోయినా, ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినా, ట్యాంపరింగ్‌ చేసినా సంబంధిత అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాల్లో పారదర్శకత కోసం సీసీ ఫుటేజీని పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.

 

ఏసీబీ దాడులు లేదా ఉన్నతాధికారుల తనిఖీల సమాచారాన్ని ముందుగానే చేరవేసేందుకు రహస్య కోడ్‌లు, సంకేతాలు, నంబర్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఇలాంటి చర్యలు తమ పరిధిలో జరగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కార్యాలయ అధికారులదేనని విజిలెన్స్ విభాగం స్పష్టం చేసింది.

 

ప్రతి నెల 15వ తేదీ నాటికి అమలు చర్యలపై మంత్లీ కాంప్లయన్స్‌ నివేదికను కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ చర్యలతో రవాణాశాఖలో అవినీతికి చెక్‌ పడటమే కాకుండా, సాధారణ ప్రజలకు పారదర్శక సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ఆదేశాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button