రూ.5 లక్షల లంచం.. కీసర ఎస్ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
షన్ బెయిల్ మంజూరు చేసి వేధింపులు లేకుండా చూస్తామంటూ డబ్బు డిమాండ్.. ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు లంచం స్వీకరించిన ఎస్ఐ

నిజం న్యూస్ | సెప్టెంబర్ 17, 2026
హైదరాబాద్: కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. సెప్టెంబర్ 16న రాత్రి 11.25 గంటల సమయంలో ఏసీబీ సిటీ రేంజ్-1 యూనిట్ అధికారులు ఈ ట్రాప్ నిర్వహించారు.
కీసర పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు వేధింపులు లేకుండా చూస్తామని చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. కీసర ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ ఆర్కపల్లి ఆంజనేయులు సూచనల మేరకు ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.
ఎస్ఐ వద్ద నుంచి రూ.5 లక్షల ట్రాప్ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఇద్దరినీ నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ పేర్కొంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



