CMRF క్లెయిమ్‌కు రూ.1 లక్ష లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
తెలంగాణ సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ (AO-1), బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్లో టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ఈ కేసులో పట్టుబడ్డారు.

హైదరాబాద్ | నిజం న్యూస్ | సెప్టెంబర్ 11, 2026
ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేసేందుకు రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ (AO-1), బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్లో టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ఈ కేసులో పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుడికి సంబంధించిన CMRF వైద్య రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడం, మంజూరైన రూ.2 లక్షల మొత్తానికి చెక్కు జారీ చేయడం, అలాగే మిగిలిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడం కోసం ఇద్దరూ కలిసి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ వ్యవహారంలో రాఘవేందర్ గతంలోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.5,000 లంచం డిమాండ్ చేసి, వినోద్ ద్వారా ఫోన్‌పే లావాదేవీతో స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది.
తాజాగా రూ.1 లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారుడి నుంచి మేడి వినోద్ రూ.1 లక్ష స్వీకరించి, ఆ మొత్తాన్ని రాఘవేందర్‌కు అందజేస్తుండగా సిటీ రేంజ్-II ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. అనంతరం లంచం సొమ్మును రాఘవేందర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు ఉద్యోగులు తమ అధికారిక విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
కేసులో నిందితులైన ఇద్దరినీ SPE, ACB కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా ఏసీబీ అధికారులు వెల్లడించలేదు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో నిజం న్యూస్



