సమావేశమా? గందరగోళమా?

మాడ్గుల మండల కేంద్రంలో నేడు నిర్వహించనున్న మండల సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మాడ్గుల, సెప్టెంబర్ 15 (నిజం చెపుతాం): మాడ్గుల మండల కేంద్రంలో నేడు నిర్వహించనున్న మండల సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం గందరగోళంగా సాగడంతో ప్రజాప్రతినిధులు,అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో నేటి సర్వసభ్య సమావేశమైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సజావుగా జరుగుతుందా? లేక గత పరిస్థితులే పునరావృతమవుతాయా? అనే చర్చ మండలవ్యాప్తంగా సాగుతోంది.మండలంలోని గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,పారిశుద్ధ్యం, తాగునీరు,విద్య,వైద్యం, రహదారులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు సభలో ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే గత సమావేశం మాదిరిగా వాగ్వాదాలు, గందరగోళానికి తావులేకుండా ప్రతి అంశాన్ని క్రమపద్ధతిలో చర్చించాలని ప్రజలు కోరుతున్నారు.గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాప్రతినిధులు నేరుగా ప్రశ్నలు సంధిస్తే సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయడం కాకుండా చర్చించిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపి, వాటి అమలుపై బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.గత సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరిగేలా,ప్రజాప్రతినిధులందరికీ మాట్లాడే అవకాశం కల్పించేలా సమావేశాన్ని నిర్వహించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి సమావేశం ప్రజా సమస్యలకు వేదికగా నిలుస్తుందా? లేక మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button