మహిళా గౌరవం గాయపడిన వేళ… సభా మర్యాద తలవంచిన రోజు..ఉత్తమ్ పద్మావతి రెడ్డి
మహిళా పోలీసులపై బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు, సభ్యులు ప్రదర్శించిన ప్రవర్తనను, ఉపయోగించిన అత్యంత అవమానకరమైన పదజాలాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా పోలీసులపై అవమానకర ప్రవర్తన సభ్యసమాజానికే సిగ్గుచేటు
సభాపతి గౌరవాన్ని కాపాడటం పార్టీలకు అతీతంగా ప్రతి సభ్యుడి బాధ్యత
మైక్‌లో వినిపించకపోయినా హేయమైన వ్యాఖ్యలను ఉపేక్షించవద్దు
బీఆర్ఎస్ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి
“ఒక మహిళగా… ఒక ప్రజాప్రతినిధిగా… ఒక బాధ్యతగల పౌరురాలిగా ఈ అంశంపై శాసనసభలో మాట్లాడాల్సి రావడమే నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మన శాసనసభ చరిత్రలో ఇటువంటి రోజు వచ్చి ఉండకూడదు” అని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి భావోద్వేగంతో పేర్కొన్నారు.
శాసనసభ సమావేశాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు, సభ్యులు ప్రదర్శించిన ప్రవర్తనను, ఉపయోగించిన అత్యంత అవమానకరమైన పదజాలాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లచొక్కాలు ధరించడంపై ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే నినాదాలు, అక్షరాలతో కూడిన టీషర్టులు సభలో ప్లకార్డులుగానే పరిగణించబడతాయన్న విషయం సభ్యులందరికీ తెలుసని పేర్కొన్నారు. సభా నియమాలను తెలిసే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి, సమావేశాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
శాసనసభ ప్రాంగణంలో ఎక్కడ పురుష పోలీసులను, ఎక్కడ మహిళా పోలీసులను విధుల్లో నియమించాలనేది పోలీసు శాఖ నిర్ణయమని స్పష్టం చేశారు. తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించిన మహిళా పోలీసులను “మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు?” అంటూ ప్రశ్నించడం, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరి హక్కూ కాదన్నారు.
“పదిమంది పురుషులు చొక్కాలు విప్పి మహిళా పోలీసుల వైపు ముందుకు వస్తే, అక్కడ విధుల్లో ఉన్న యువ మహిళా కానిస్టేబుళ్లు ఎలాంటి మానసిక వేదనకు, భయానికి గురై ఉంటారో ఒక్క క్షణం ఊహించాలి. ఆ దృశ్యాలను ఫొటోల్లో చూడటానికే నాకు భయమేస్తోంది. విధి నిర్వహణకు వచ్చిన ఆడబిడ్డలు ఇటువంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావడం నా హృదయాన్ని కలచివేసింది” అని పద్మావతి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
“ఇది మా సంస్కృతి కాదు… బాధ్యతగల శాసనసభ్యుల ప్రవర్తన అంతకన్నా కాదు. మానవత్వం తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున ఆ మహిళా పోలీసు సిబ్బందికి నేను క్షమాపణ చెబుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనలపై మహిళా శాసనసభ్యులందరూ కలిసి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీడియా ప్రసారాలు, దృశ్యాలు, వార్తల ద్వారా యూనిఫాం ధరించిన మహిళా పోలీసులపై జరిగిన అవమానకర చర్యలను చూసి తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఈ ఫిర్యాదును సమర్పించినట్లు వివరించారు. ఇది కేవలం కొందరు మహిళా కానిస్టేబుళ్లకు జరిగిన అవమానం మాత్రమే కాదని, పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న యావత్ మహిళా సిబ్బంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి సభలో అడుగుపెట్టిన ప్రతి సభ్యుడిపైనా సభాపతి పీఠం గౌరవాన్ని కాపాడాల్సిన కనీస నైతిక బాధ్యత ఉందన్నారు. సభాపతిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఉపయోగించిన అనుచిత పదజాలం, చేసిన హేయమైన వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్ఠకే మచ్చతెచ్చేలా ఉన్నాయని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
“సభాపతి గౌరవం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు… అది మొత్తం శాసనసభ గౌరవం. సభ లోపలైనా, బయటైనా ఆ పీఠం ప్రతిష్ఠను కాపాడటం పార్టీలకు అతీతంగా ప్రతి శాసనసభ్యుడి బాధ్యత” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి, సహచర శాసనసభ్యులు, మంత్రి సీతక్కతోపాటు సభాపతిపై కూడా కొందరు సభ్యులు చేస్తున్న అనుచితమైన సైడ్ కామెంట్లను ఉపేక్షించరాదని కోరారు. మైక్‌లో రికార్డు కాలేదనే సాంకేతిక కారణంతో అటువంటి వ్యాఖ్యలను వదిలేయడం వల్ల అవమానకరంగా మాట్లాడేవారికి మరింత ధైర్యం కలుగుతోందన్నారు.
“ప్రజాస్వామ్యం మాట్లాడే స్వేచ్ఛను ఇస్తుంది… కానీ మహిళలను అవమానించే హక్కును కాదు. విమర్శించే అవకాశం ఇస్తుంది… కానీ సభాపతి పీఠాన్ని కించపరిచే అనుమతిని కాదు. మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ విశాల దృక్పథాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ఇప్పుడు పరిస్థితి సహనానికి కూడా హద్దులు దాటింది. ఇకపై ఇటువంటి చర్యలను సహించేది లేదు” అని పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు.
మహిళా పోలీసులపై అవమానకరంగా ప్రవర్తించిన వారితోపాటు, సభాపతి, మహిళా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యులందరిపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు.
“ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన పవిత్రమైన శాసనసభ… మహిళల కన్నీళ్లకు కారణం కాకూడదు. ప్రజల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపాల్సిన సభ… వ్యక్తిగత దూషణలకు, మహిళల అవమానానికి వేదిక కాకూడదు. సభా గౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సభాపతి దృఢమైన నిర్ణయం తీసుకోవాలి” అని శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.



