రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్‌, మండల సర్వేయర్‌!

భూమి సర్వే నివేదిక జారీకి భారీగా లంచం డిమాండ్‌.. ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు

హైదరాబాద్, అక్టోబర్ 13 | నిజం న్యూస్:

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ రూ.20 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. 2026 అక్టోబర్ 12, సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం భూమి సర్వే నిర్వహించి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు (ఏఓ-1), తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి (ఏఓ-2) ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ సిటీ యూనిట్‌ అధికారులు పట్టుకున్నారు. తొలుత రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి, అనంతరం రూ.20 లక్షలకు తగ్గించినట్లు ఏసీబీ పేర్కొంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామం, మండల పరిధిలో లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఓ-1 చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. ఇద్దరు అధికారులు తమ విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు పేర్కొంది.

నిందితులిద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

లంచం డిమాండ్‌ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button