డ్యూటీలో ఉన్నట్లు రికార్డులు.. ఫామ్‌హౌస్‌లో జల్సాలు!
బెల్లంపల్లి పోలీసుల రేన్ డ్యాన్స్ వీడియోలు వైరల్.. ఐదుగురిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్, మరో 9 మందిపై చర్యలు

హైదరాబాద్, నవంబర్ 18 | నిజం న్యూస్
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే విధి నిర్వహణను విస్మరించి ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఫామ్‌హౌస్‌లో డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కఠిన చర్యలు తీసుకున్నారు.
విధుల్లో ఉన్నట్లు నమోదు చేసి వేడుకలకు?
ఈ నెల 15న తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పోలీస్ సిబ్బంది పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. స్టేషన్ రికార్డుల్లో విధులకు హాజరైనట్లు నమోదు చేసుకుని వేడుకలకు వెళ్లినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఫామ్‌హౌస్‌లో రేన్ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు చేస్తూ పోలీస్ సిబ్బంది సందడి చేసిన దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
సోషల్ మీడియాలో వైరల్.. ఉన్నతాధికారుల విచారణ
వేడుకల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరింది. విధుల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్ వేడుకల్లో పాల్గొన్నారా? విధులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసుకుని స్టేషన్‌ను విడిచిపెట్టారా? అనే అంశాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
14 మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐదుగురు పోలీస్ సిబ్బందిని కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం 14 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఈ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత కీలకమని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధుల్లో నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమని పేర్కొన్నారు. ప్రతి సిబ్బంది శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ వృత్తిపరమైన నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘన లేదా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్



