రూ.40 వేల లంచం డిమాండ్.. రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ వార్డు అధికారి!
పూర్వీకుల ఇంటి ఆస్తి పేరు మార్పు కోసం లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హైదరాబాద్, నవంబర్ 20 | నిజం న్యూస్
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తున్న ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని యెల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారిగా పనిచేస్తున్న డి. రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న పూర్వీకుల ఇంటి ఆస్తిని తన పేరు మీదకు మార్చి, మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేసే అధికారిక ప్రక్రియను పూర్తి చేయడానికి వార్డు అధికారి రవీందర్ రెడ్డి రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.30 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.30 వేల నగదును స్వీకరిస్తుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.
లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్



