ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో టౌన్ ప్లానింగ్ అధికారి వాణి.. రూ.6.76 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ!

లంచం కేసు తర్వాత మరోసారి ఏసీబీ సోదాలు.. 8 ప్రాంతాల్లో తనిఖీలు, భారీగా స్థిర, చరాస్తుల గుర్తింపు

హైదరాబాద్, నవంబర్ 17 | నిజం న్యూస్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు నవంబర్ 16న ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ప్రాథమిక సోదాలు నిర్వహించారు.

రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు గుర్తింపు

సోదాల్లో పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల మరో ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.87.67 లక్షలుగా అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన నివాస ఫ్లాట్, సుమారు రూ.2.45 కోట్ల విలువైన జీ+2 నివాస భవనం ఉన్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించగా, దాని విలువ రూ.29.70 లక్షలుగా అంచనా వేశారు.

చరాస్తులు, పెట్టుబడులు కూడా భారీగానే..

సోదాల్లో రూ.5.47 లక్షల నగదు, మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవాని వైన్స్‌లో రూ.50 లక్షల పెట్టుబడి, రూ.1.30 కోట్ల షేర్ల పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.54 లక్షల విలువైన బంగారం, మహీంద్రా XUV700, హ్యుందాయ్ క్రెటా సహా నాలుగు చక్రాల రెండు వాహనాలు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం రూ.50 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. గృహోపకరణాల విలువ రూ.5.10 లక్షలుగా పేర్కొంది.

గతంలో రూ.75 వేల లంచం తీసుకుంటూ పట్టుబడి..

ఇదే అధికారిపై గత సెప్టెంబర్ 30న క్రైమ్ నంబర్ 29/RCT-CR2/2026 కింద అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. మొయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రాథమిక సోదాలు నిర్వహించి పలు ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను గుర్తించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button