చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష! రూ.95 లక్షల జరిమానా
2018 నాటి అప్పు వ్యవహారంలో ఒంగోలు కోర్టు తీర్పు.. అప్పీల్‌కు నెల రోజుల గడువు

హైదరాబాద్, నవంబర్ 18 | నిజం న్యూస్
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన ఒంగోలు కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, బాధితుడికి కేసు విచారణ సందర్భంగా అయిన కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశిస్తూ బుధవారం, నవంబర్ 18, 2026న తీర్పు వెలువరించింది.
2018 నాటి అప్పు వ్యవహారం..
ఈ కేసు 2018లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేశ్ తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో రూ.95 లక్షల చెక్కును అందజేశారు.
అయితే బ్యాంకులో జమ చేయగా ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. డబ్బుల చెల్లింపులో న్యాయం జరగకపోవడంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.
విచారణ అనంతరం శిక్ష ఖరారు..
ఈ కేసుపై న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం చెక్ బౌన్స్ నేరం రుజువైనట్లు నిర్ధారించి బండ్ల గణేశ్‌కు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.95 లక్షల జరిమానాతో పాటు బాధితుడి కోర్టు ఖర్చులను సైతం చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
అప్పీల్‌కు నెల రోజుల గడువు..
తాజా తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేశ్‌కు నెల రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం. గతంలోనూ ఆయన పలు చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయా కేసుల్లో పైకోర్టులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా ఒంగోలు కోర్టు వెలువరించిన తీర్పు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్



