హోటల్‌కు నెలవారీ మామూళ్లు డిమాండ్.. రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌకి ఇన్‌స్పెక్టర్!

రూ.40 వేలు లంచం ఒప్పందం.. రూ.20 వేలు స్వాధీనం.. మరో రూ.1.80 లక్షల లెక్కల్లో చూపని నగదు గుర్తింపు

హైదరాబాద్, నవంబర్ 19, 2026 | నిజం న్యూస్

హోటల్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించేందుకు నెలవారీ లంచం డిమాండ్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ జోన్ పరిధిలో ఉన్న టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ వివరాల ప్రకారం.. హోటల్ యాజమాన్యంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల సౌకర్యం కోసం రాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా మరో గంట పాటు హోటల్ క్యాంటీన్ నిర్వహించుకునేందుకు అనుమతించే విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఇన్‌స్పెక్టర్ నెలవారీ లంచం డిమాండ్ చేశాడు.

గత అక్టోబర్ 31న ఫిర్యాదుదారుడిని రూ.50 వేల నెలవారీ లంచం అడిగి, రూ.20 వేలు స్వీకరించాడు. అనంతరం మొదటి నెలకు రూ.10 వేల రాయితీ ఇచ్చి, మొత్తం రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మిగిలిన రూ.20 వేల లంచాన్ని నవంబర్ 18న రాత్రి 9.40 గంటల సమయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

లంచంగా తీసుకున్న రూ.20 వేల నగదును ఇన్‌స్పెక్టర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, తనిఖీల సమయంలో నాలుగు వేర్వేరు కవర్లలో ఉంచిన లెక్కల్లో చూపని రూ.1.80 లక్షల నగదును కూడా గుర్తించారు.

నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button