సర్వే నెం. 540 లో యథేచ్ఛగా ఆక్రమణలు..!
మఠంపల్లి లో అక్రమపర్వం..! నిద్రవస్థలో అటవీ శాఖాధికారులు.. స్థానికుల ఆగ్రహం..!

వందలాది జామాయిల్ చెట్ల నరికివేత..?
కన్నెత్తి చూడని అటవీ శాఖ అధికారులు..!
మఠంపల్లి లో అక్రమపర్వం..! నిద్రవస్థలో అటవీ శాఖాధికారులు.. స్థానికుల ఆగ్రహం..!
అధికారుల నిర్లక్ష్యం ఆక్రమణదారులకు వరంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అటవీ భూములను అడ్డగోలుగా ఆక్రమిస్తున్నా, వందలాది చెట్లను నరికివేస్తున్నా అటవీ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈ అక్రమ ఉదంతం వెలుగుచూసింది.
30 ఎకరాల్లో చెట్ల నరికివేత..?
మండలంలోని గుర్రంబోడు తండా పరిధిలోని సర్వే నెంబర్ 540లో డక్కన్ సిమెంట్స్ యాజమాన్యం గతంలో 108 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు అప్పగించింది. ఈ భూమిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వందలాది జామాయిల్ చెట్లను పెంచారు. అయితే, గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఈ భూమిపై కన్నేశారు. అందులో దాదాపు 30 ఎకరాల మేర అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా, అందులో ఉన్న వందలాది జామాయిల్ చెట్లను యథేచ్ఛగా నరికివేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టించుకోని అటవీ అధికారులు..!
లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద ధ్వంసమవుతున్నా, అటవీ భూములు పరాధీనమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఆక్రమణదారులు “అంతా మా ఇష్టం” అన్నట్లుగా వ్యవహరిస్తున్నా అటవీ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకోవాలని డిమాండ్..!
పచ్చని చెట్లను నరికి, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆక్రమణలను తొలగించాలని, ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



