రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై!

ఆత్మహత్య కేసులో ఇరికిస్తానని బెదిరింపు.. బజార్‌హత్నూర్ ఎస్సై రమేష్ అరెస్ట్

హైదరాబాద్, నవంబర్ 5 | నిజం న్యూస్

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో పోలీసు అధికారి చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి. రమేష్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం (నవంబర్ 4) ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికాని ఓ యువతి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుడిని ఇరికించకుండా ఉండటంతో పాటు, తన వద్ద ఉంచుకున్న ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఎస్సై రమేష్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. మొదట రూ.50 వేలు డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

లంచం తీసుకునే క్రమంలో గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంకు సమీపానికి ఫిర్యాదుదారుడిని పిలిచిన ఎస్సై, అక్కడ ఉన్న సెంటరింగ్ బాక్సుల కింద డబ్బులు పెట్టాలని సూచించినట్లు ఏసీబీ పేర్కొంది. ఆయన సూచన మేరకు ఫిర్యాదుదారుడు రూ.40 వేల నగదును అక్కడ ఉంచగా, ఈ వ్యవహారంపై ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఎస్సైపై ఆరోపణలు నమోదయ్యాయి. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని అవినీతి నిరోధక శాఖ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా 9440446106 నంబర్‌కు సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది.

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button