రూ.14 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ పాలన అధికారి
ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులు వల పన్ని ఇద్దరినీ పట్టుకున్నారు.

హైదరాబాద్,తేదీ: 25,ఆగస్ట్,నిజం న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మండలంలో రూ.14 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ పాలన అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులు వల పన్ని ఇద్దరినీ పట్టుకున్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెముగంటి పూర్ణచందర్‌రావు, కొలనుపాక గ్రామ గ్రామ పాలన అధికారి షేక్ అహ్మద్ లు లంచం కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడి సోదరి విక్రయించిన భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తహసీల్దార్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉండగా, ఆ అధికారిక పని చేసేందుకు రూ.14 వేల లంచాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఆ మొత్తాన్ని గ్రామ పాలన అధికారి షేక్ అహ్మద్ ద్వారా స్వీకరించినట్లు పేర్కొంది.
ఏసీబీ అధికారులు వల పన్ని లంచం మొత్తాన్ని షేక్ అహ్మద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సూచన మేరకే ఆయన వద్ద డబ్బు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది.
ఇద్దరు నిందితులను నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా ఏసీబీ వెల్లడించలేదు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్ – స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



