రేపు నీట్‌ పరీక్ష.. సర్వం సిద్ధం

హైదరాబాద్‌, మే 2 : దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌ యూజీ-2026) ఆదివారం జరగనుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సమన్వయంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

 

ఈ ఏడాది తెలంగాణ నుంచి మొత్తం 73,084 మంది అభ్యర్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది 72,507 మంది 190 కేంద్రాల్లో పరీక్ష రాశారు.

ఈసారి అభ్యర్థుల సంఖ్యతో పాటు పరీక్ష కేంద్రాల సంఖ్య కూడా పెరగడం విశేషం. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

 

నీట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 556 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, విదేశాల్లో కూడా 14 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్క్‌ కోత విధిస్తారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నుంచి తలా 45 ప్రశ్నలు, బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి.

 

పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రతి ఐదు పరీక్ష కేంద్రాలకు ఒక సివిల్‌ నోడల్‌ ఆఫీసర్‌ను, ప్రతి కేంద్రానికి ఒక పోలీసు అధికారిని నియమించారు. కేంద్రాల వద్ద డ్యూయల్‌ లేయర్‌ ఫ్రిస్కింగ్‌ విధానం అమలు చేస్తారు. అన్ని కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌, జామర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, భద్రత మొత్తం పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే తెలియజేసేందుకు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

 

విద్యార్థులు నిర్ణీత సమయానికి కనీసం అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. డ్రెస్‌ కోడ్‌ను కచ్చితంగా పాటించడంతో పాటు పారదర్శక వాటర్‌ బాటిల్‌, మూడు పేజీల అడ్మిట్‌ కార్డ్‌ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈసారి పరీక్ష కేంద్రాల కేటాయింపులో అమ్మాయిలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది.

 

ఇక పరీక్షలో 15-20 ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు అటువంటి ప్రశ్నలపై ఎక్కువ సమయం ఖర్చు చేయకుండా, చివరి అరగంటలో వాటిని ప్రయత్నించడం మంచిదని సూచిస్తున్నారు. సగటున ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం సమయం మాత్రమే లభిస్తుందని, సమయ నిర్వహణ కీలకమని చెబుతున్నారు.

 

గత ఏడాది తెలంగాణలో నీట్‌ పరీక్షలో సుమారు 405 మార్కులు సాధించిన వారికి జనరల్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీట్లు లభించాయి. ఈసారి పోటీ మరింత పెరగనున్న నేపథ్యంలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button