మున్సిపల్ అధికారిపై ఏసీబీ దాడి.. రూ.50 వేల లంచం తీసుకుంటూ డీఈఈ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వైనం!

పెండింగ్ బిల్లు చెల్లింపునకు లంచం డిమాండ్.. గతంలోనూ రూ.10 వేలు స్వీకరించిన అధికారి.. కారు డ్యాష్‌బోర్డులో నగదు స్వాధీనం

హైదరాబాద్, నవంబర్ 11 | నిజం న్యూస్

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచగొండి అధికారిపై కొరడా ఝళిపించారు. పెండింగ్ బిల్లు చెల్లించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా మున్సిపాలిటీలో సివిల్ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రావాల్సిన రూ.2,63,128 పెండింగ్ బిల్లు చెల్లించేందుకు అధికారి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గత అక్టోబర్ 26న రూ.10 వేల లంచం తీసుకుని రూ.6.40 లక్షల చెక్కును విడుదల చేశారు. అనంతరం మిగిలిన రూ.2,63,128 చెల్లింపునకు మరో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నవంబర్ 10న రూ.50 వేల లంచం తీసుకుంటుండగా జాదవ్ సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును ఆయన కారులోని డ్యాష్‌బోర్డు నుంచి స్వాధీనం చేసుకున్నారు. డ్యాష్‌బోర్డుపై నిర్వహించిన రసాయన పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.

అధికారిక పదవిని దుర్వినియోగం చేసి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button