బ్యాంకాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 9 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

బ్యాంకాక్, జూలై 13 (నిజం న్యూస్): థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచెత్తింది.

ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 9 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో 60 మందికి పైగా గాయపడగా, క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్యాంకాక్‌లోని ‘రాంగ్ బీర్ నా లాడ్‌ఫ్రాయో’ (Rong Beer Na Ladprao) పబ్‌లో ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పబ్‌లో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో భవనంలో మరమ్మతు పనులు కొనసాగుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొద్ది క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది.

 

మంటలు వ్యాపించడంతో పబ్‌లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. అయితే పబ్‌కు ఒకే ఒక్క ప్రవేశ–నిష్క్రమణ ద్వారం మాత్రమే ఉండటంతో బయటకు వెళ్లడం అత్యంత కష్టంగా మారింది. దీంతో పలువురు లోపలే చిక్కుకుపోయారు. దట్టమైన పొగ కారణంగా భవనంలో ఏమీ కనిపించకపోవడంతో కొందరు రెస్ట్‌రూమ్‌లలోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. అయితే రెస్ట్‌రూమ్‌లలో కూడా మృతదేహాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. చాలామంది పొగను పీల్చడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం భవనం అంతటా గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 60 మందికి పైగా బాధితులకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

 

అధికారుల ప్రాథమిక విచారణలో భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో పాటు భవన నిర్మాణం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

ఈ ఘటనపై థాయ్‌లాండ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రభుత్వం, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా పబ్‌లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను సమీక్షించి తనిఖీలు నిర్వహించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

 

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button