రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్.. ప్రైవేట్ వ్యక్తి కూడా అరెస్ట్!

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్.. ప్రైవేట్ వ్యక్తి కూడా అరెస్ట్!

పెట్రోల్ బంకు వెరిఫికేషన్ సర్టిఫికెట్, రోజువారీ విక్రయాల రిజిస్టర్ అందజేసేందుకు లంచం డిమాండ్.. రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5 వేలు ప్రైవేట్ వ్యక్తికి వాటా

హైదరాబాద్, అక్టోబర్ 29 | నిజం న్యూస్

లంచం తీసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ప్రైవేట్ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. పెట్రోల్ బంకుకు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇప్పటికే జారీ చేసినప్పటికీ, రోజువారీ విక్రయాల రిజిస్టర్‌ను అందజేసేందుకు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

(బుధవారం, అక్టోబర్ 28) జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వర్లు, ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో పెట్రోల్ పంపు టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.

పెట్రోల్ బంకుకు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇప్పటికే జారీ చేయడంతో పాటు, రోజువారీ విక్రయాల రిజిస్టర్‌ను అందజేసినందుకు ప్రతిఫలంగా ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వివరించింది. ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు రవీందర్ ఫిర్యాదుదారుడి నుంచి హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ వద్ద రూ.20 వేల నగదును స్వీకరించినట్లు తెలిపింది.

ఈ మొత్తంలో రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు, మిగిలిన రూ.5 వేలు రవీందర్‌కు చెందాల్సి ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రవీందర్ వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇన్‌స్పెక్టర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరినీ నాంపల్లిలోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టినట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా తెలంగాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button