ఖమ్మం జిల్లా ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య.. మహబూబాబాద్‌లో విషాదం
సంధ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. ఆమె మృతిపై తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మహబూబాబాద్, ఆగస్టు 18, నిజం న్యూస్:
మహబూబాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్‌లో ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
మహబూబాబాద్ పట్టణంలోని సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో నివాసం ఉంటున్న డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె సంధ్య. ఆమె ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందారు. గతంలో గ్రూప్-4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో విధులు నిర్వహించారు. అనంతరం గ్రూప్-2లో ఎంపికై డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్నారు.
ఇటీవల సెలవుపై మహబూబాబాద్‌లోని తన స్వగృహానికి వచ్చిన సంధ్య.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే సంధ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. ఆమె మృతిపై తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, మానసిక ఒత్తిడా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో – నిజం న్యూస్



