ఇందిరమ్మ బీమాతో ప్రతి ఇంటికి భరోసా..అర్హులందరికీ జీవిత బీమా లక్ష్యం

అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది

ఇంటింటి సర్వేకు శ్రీకారం..

హైదరాబాద్‌, మే 27 (నిజం న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.

సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు విధానంతో పాటు జూన్‌ 2 నుంచి 12 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలపై చర్చించారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కమిటీ పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర గృహస్థాయి డేటా సేకరణ చేపట్టాలని, ఎవరైనా మిగిలిపోతే ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు చేయాలని అధికారులకు సూచించింది.

సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ప్రత్యేక ‘లోగో’తో కూడిన స్టిక్కర్‌ను అతికించాలని, పథకం ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇక రాష్ట్రంలో 99 రోజులుగా కొనసాగుతున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ విజయవంతం కావడంతో జూన్‌ 2 నుంచి 12 వరకు ఘన ముగింపు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పర్యావరణ వారోత్సవాలు, రోడ్డు భద్రత ప్రచారం, మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన, మహిళా–శిశు రక్షణ, గృహ నిర్మాణం, పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలు, పట్టణాభివృద్ధి మరియు హరిత ఇంధన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేపట్టాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button