రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య.. ఆస్పత్రికి తరలించగా మృతి
భార్య తన భర్తను రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హుస్నాబాద్, ఆగస్టు 18:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. భార్య తన భర్తను రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో వెంకటేశం, రాజమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాజమణి ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
వెంకటేశం ఈ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాజమణి భర్త వెంకటేశంపై రోకలిబండతో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో వెంకటేశం తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అందించేలోపే పరిస్థితి విషమించడంతో వైద్యులు పరీక్షించి వెంకటేశం మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య రాజమణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన కుటుంబ కలహాలు, రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి వివాదానికి సంబంధించిన అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
రిటైర్మెంట్కు చేరువైన సమయంలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటన హుస్నాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



