గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్.. తక్కువ ధరకే బంగారం పేరుతో భారీ మోసం

తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన 'గోల్డ్ మ్యాన్'గా పేరొందిన సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్, జూన్ 26 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్):

తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ‘గోల్డ్ మ్యాన్’గా పేరొందిన సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాభాయ్ ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించి ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకుంటూ, తనకు ముఖ్యమంత్రి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మించేవాడు. విదేశాల నుంచి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం తెప్పించి అందజేస్తానంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచినా బంగారం ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిని బెదిరించినట్లు కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సూర్యాభాయ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతను మరెంతమందిని ఇదే తరహాలో మోసం చేశాడా? ఎంత మేర డబ్బులు వసూలు చేశాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలు తక్కువ ధరకే బంగారం, విలువైన వస్తువులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని పోలీసులు సూచించారు. ఎలాంటి పెట్టుబడులు లేదా కొనుగోళ్లు చేసే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button