హుజూర్ నగర్ విద్యుత్ శాఖలో అవినీతి సెగలు: ఏఈ వసూళ్ల పర్వం..!

ఎస్టిమేషన్ కో రేటు.. డిమాండ్ కో రేటు .. 'పిక్స్'..విద్యుత్ శాఖలో అడ్డగోలు దోపిడీ..!

నియమ నిబంధనలు పాటించాల్సిన అధికారే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. “నేను లోకల్.. నన్ను అడిగేదెవరు?” అనే ధీమాతో హుజూర్ నగర్ విద్యుత్ శాఖ ఏఈ సాగిస్తున్న అక్రమాలు ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ, సామాన్యుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్టిమేషన్ కో రేటు.. డిమాండ్ కో రేటు..!

హుజూర్ నగర్ మండలంలోని ప్రైవేటు వెంచర్లు, గృహ నిర్మాణాలకు విద్యుత్ స్తంభాలు వేయడంలో నిబంధనలు గాలికి వదిలేశారు. వినియోగదారులు కట్టాల్సిన డీడీల కంటే పదింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు లక్షల రూపాయలతో సైలెంట్ ..సెటిల్మెంట్..!

విద్యుత్ అధికారి వసుళ్ల పర్వానికి ఉదాహరణగా నిలిచింది ఒక సంఘటన హుజూర్ మండలం గోపాలపురం గ్రామంలో ఒక ప్రైవేటు విద్యుత్ శాఖ హెల్పర్ ను అడ్డం పెట్టుకుని ఏఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల్లో భాగంగా కోళ్ల ఫారం దగ్గర జరిగిన ప్రమాదంలో హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. నిబంధనల ప్రకారం లైన్ మెన్ సమక్షంలో ఎల్.సి (LC) తీసుకున్న తర్వాతే పనులు చేయాల్సి ఉండగా, కాసులకు కక్కుర్తి పడి లైన్మెన్ అనుమతి తీసుకోకుండానే ఈ అధికారి మాత్రం ప్రైవేటు వ్యక్తులతో రిస్క్ పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ ప్రమాదంలో హెల్పర్ తన కాలు, చెయ్యి కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా రూ. 3 లక్షలతో సెటిల్మెంట్ చేయడం వెనుక ఏఈ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ప్రైవేట్ పాఠశాలకూ తప్పని వేధింపులు..!అక్షరధామాలకూ అక్రమ వేధింపులే..

పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యుత్ కనెక్షన్ విషయంలో ఈ అధికారి ప్రదర్శించిన తీరు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. మొదట రూ. 60 డీడీ కట్టించుకుని, తర్వాత ఏకంగా రూ. 4.80 లక్షల ఎస్టిమేషన్ వేసి యాజమాన్యాన్ని హడలెత్తించారు. విసుగు చెందిన వారు సోలార్ వైపు మొగ్గు చూపగా, వెంటనే రంగంలోకి దిగిన ఏఈ.. ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా రూ. 3.60 లక్షల నగదు ఇస్తే పని పూర్తి చేస్తానని బేరానికి దిగడం గమనార్హం. చివరకు లక్షల రూపాయల డీడీలతో పాటు, అదనంగా మరో రూ. 15 వేలు ముట్టజెప్పాకే ఆ పాఠశాలకు కనెక్షన్ ఇచ్చినట్లు సమాచారం.

ఉచితం ఏది..? ఊపిరి సలపని వసూళ్లు..!

నిబంధనల ప్రకారం గృహ అవసరాలకు నిర్దేశిత దూరం వరకు స్తంభాలు ఉచితంగా ఇవ్వాలనే జీవోలు ఉన్నప్పటికీ, హుజూర్ నగర్‌లో మాత్రం ఒక్కో స్తంభానికి వేలల్లో వసూలు చేస్తున్నారు. పట్టణంలో ఒక సామాన్యుడు మీటర్ కోసం రూ. 3,000-/ డిడి రూపంలో విద్యుత్ స్తంభం కోసం రూ.9,000-/ డీడీ రూపంలో చెల్లించినా, అదనంగా మరో రూ. 12,000-/డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక విద్యుత్ కనెక్షన్ లేని మీటర్ ను ఇంట్లోనే ఒక మూలకు వేశాడు. అమాయకుల దగ్గర వేల రూపాయలు గుంజి కూడా నెలల తరబడి పనులు పూర్తి చేయకుండా తిప్పించుకోవడం ఇక్కడి అధికారుల తీరుకు అద్దం పడుతోంది

ఉన్నతాధికారుల అండ ఉందా..?

బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్నా, (డీఈ) స్థాయి అధికారులు ఈ ఏఈ పై చర్యలు తీసుకోకపోవడం వెనుక మర్మమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల అండ చూసుకునే ఏఈ ఇలా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, హుజూర్ నగర్ విద్యుత్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button