ఫీల్డ్ అసిస్టెంట్‌ను బలిపశువుగా చేసే ప్రయత్నమా..?
సస్పెన్షన్ కాలంలో జాబ్ కార్డుల తొలగింపుపై దుమారం..!

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మట్టంపల్లి మండలం మంచా తండా గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తొలగింపుల బాధ్యతను కిందిస్థాయి సిబ్బందిపై నెట్టి, ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు..!
గత ఏడాది జూన్ 2025లో మంచా తండా పంచాయతీ పరిధిలో పెద్ద సంఖ్యలో జాబ్ కార్డులను తొలగించారు. అయితే, ఈ తొలగింపు ప్రక్రియ అంతా ఫీల్డ్ అసిస్టెంట్ (FA) లాగిన్ ద్వారానే జరిగిందని సంబంధిత ఏపీవో (APO) లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. గతంలో మండల ఎంపీడీవో, ఏపీవో జాబ్ కార్డుల తొలగింపు విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తి ఎలా తొలగిస్తారు..?
బాధిత ఫీల్డ్ అసిస్టెంట్ ఏప్రిల్ 28, 2025 నుండి జూలై 14, 2025 వరకు విధులకు దూరంగా, సస్పెన్షన్‌లో ఉన్నారు. జాబ్ కార్డుల తొలగింపు జరిగిన జూన్ నెలలో సదరు ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్లోనే లేరు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా ఉపాధి పనులు చేయించినట్లు సమాచారం. విధుల్లో లేని వ్యక్తి లాగిన్ ఉపయోగించి కార్డులు ఎలా తొలగించారో, దానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఎలా బాధ్యుడవుతారో సమాధానం చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా లాగిన్ ఐడీల పంపిణీ..!
మండల స్థాయి అధికారుల వద్ద ఉండాల్సిన కీలకమైన లాగిన్ ఐడీలను, పాస్‌వర్డ్‌లను మేట్లకు, మల్టీపర్పస్ వర్కర్లకు మరియు ఇతర సిబ్బందికి ఏ నిబంధనల ప్రకారం కట్టబెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిర్దోషులైన కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమగ్ర విచారణ జరిపించాలి..!
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, సస్పెన్షన్ కాలంలో లాగిన్ ఐడీని ఎవరు వినియోగించారు? అనర్హులైన వ్యక్తులకు లాగిన్ యాక్సెస్ ఎలా ఇచ్చారు? అనే అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అసలైన దోషులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి.



