మహబూబాబాద్‌లో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్‌పై ఏసీబీ కేసు.. రూ.9.41 కోట్ల ఆస్తుల గుర్తింపు!
ఏడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు.. ప్లాట్లు, వ్యవసాయ భూములు, భవనాలు, బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్, అక్టోబర్ 9 | నిజం న్యూస్
మహబూబాబాద్‌లో సివిల్ సప్లైస్ శాఖ జిల్లా మేనేజర్ (టెక్నికల్) వి. నరసింహారావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. ప్రస్తుతం మహబూబాబాద్‌లో జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన గతంలో ఖమ్మం కలెక్టరేట్‌లో పనిచేశారు. విధుల్లో అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది.
2026 అక్టోబర్ 9న అనుమానిత అధికారి, ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు స్థిర, చర ఆస్తులను గుర్తించారు.
స్థిరాస్తుల వివరాలు
ఖమ్మం జిల్లాలోని బల్లేపల్లి, రఘునాథపాలెం, వెలుగుమట్ల ప్రాంతాల్లో అధికారి, ఆయన భార్య పేర్లపై మొత్తం 1,230.16 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదు ఖాళీ స్థలాలను గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ రూ.30.72 లక్షలుగా ఉంది.
సూర్యాపేట జిల్లా కల్మల చెరువు, సిరికొండ, నవామర్రం ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. సిరికొండలో సుమారు 21.3 ఎకరాలు, నవామర్రంలో 5.31 ఎకరాల చొప్పున భూములు ఉన్నట్లు ఏసీబీ పేర్కొంది. ఈ భూముల డాక్యుమెంట్, ఒప్పంద విలువలను అధికారులు నమోదు చేశారు.
ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌లో జీ ప్లస్ 2 అంతస్తుల భవనం, అగర్ ఎన్‌క్లేవ్, బాలాజీనగర్‌లో జీ ప్లస్ 4 అంతస్తుల భవనం, సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని సాగర్ ఎన్‌క్లేవ్‌లో భవనాలకు సంబంధించిన ఆస్తులను కూడా గుర్తించారు. వీటి మొత్తం డాక్యుమెంట్ విలువ రూ.1.58 కోట్లుగా పేర్కొన్నారు.
చరాస్తుల వివరాలు
వాహనాల విభాగంలో హ్యుందాయ్ క్రెటా కారు విలువ రూ.18.49 లక్షలు, టీవీఎస్ జూపిటర్ వాహనం విలువ రూ.1.05 లక్షలు, హోండా యాక్టివా వాహనం విలువ రూ.50 వేలుగా గుర్తించారు.
ఇంట్లోని వస్తువుల విలువ రూ.33.48 లక్షలుగా పేర్కొన్నారు. సుమారు 360.97 గ్రాముల బంగారం, 331.58 గ్రాముల వెండితో కలిపి రూ.9.39 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. నగదు రూపంలో రూ.15,600 స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
మొత్తం ఆస్తుల విలువ రూ.9.41 కోట్లు
ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంట్ విలువ సుమారు రూ.9,41,06,975గా ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అదనపు ఆస్తులపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించింది.
అధికారి ఆస్తుల యాజమాన్యం, వాటిని సంపాదించిన విధానం, లావాదేవీలు, నిధుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక రైస్ మిల్లును బినామీ పేరుతో కొనుగోలు చేసినట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ, దాని యాజమాన్యం, పెట్టుబడుల మూలాలను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ తన ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినా ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో | నిజం న్యూస్



