తెలంగాణ విద్యా రంగంలో నూతన అధ్యాయం – ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోనే తొలి ఆదర్శ పబ్లిక్ స్కూల్‌గా రూపుదిద్దుకున్న ఈ విద్యాసంస్థను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పాఠశాల ఆవరణను పూర్తిగా పరిశీలించారు. ఇదే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అమలు చేయనున్న ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు.

నిజం న్యూస్, జూన్ 17, 2026

 

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థి యువతకు అంకితం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

తెలంగాణలోనే తొలి ఆదర్శ పబ్లిక్ స్కూల్‌గా రూపుదిద్దుకున్న ఈ విద్యాసంస్థను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పాఠశాల ఆవరణను పూర్తిగా పరిశీలించారు. ఇదే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అమలు చేయనున్న ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 

అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీలను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలు, విద్యా వనరులను పరిశీలించారు. సైన్స్ ల్యాబ్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రవాణా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను కూడా పరిశీలించారు.

 

పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సంగీతం, నృత్యం బోధించే ప్రత్యేక గదులను సందర్శించిన ముఖ్యమంత్రి వంటగదిని కూడా పరిశీలించారు. వంట సిబ్బందితో మాట్లాడి ఆహార నాణ్యతపై ఆరా తీశారు. పూరీల తయారీలో స్వయంగా పాల్గొని వారిని ప్రోత్సహించారు.

 

ఆవరణలో విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల కార్యాలయాన్ని సందర్శించి, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, విద్యార్థుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

 

అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానాలను కూడా పరిశీలించారు. వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మైదానాలతో పాటు టెన్నిస్ కోర్టులు, క్యారమ్స్ హాళ్లు, పార్కులను సందర్శించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

 

అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన మద్దతును తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కరచాలనం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించే విధంగా ఈ పాఠశాలను రూపొందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విద్యాసంస్థలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించనున్నారు. ఆధునిక సాంకేతికత, నాణ్యమైన మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలతో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే విధంగా ఈ పాఠశాల రూపుదిద్దుకుంది.

 

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button