ప్రియుడి మోజులో మాతృత్వాన్ని మరిచిన తల్లి.. రెండేళ్ల చిన్నారి దారుణ హత్య
కీసరలో సంచలనం.. రీ-పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన హత్య రహస్యం

నిజం న్యూస్ | హైదరాబాద్/మేడ్చల్ | జూన్ 20, 2026
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి,గత నెల తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, రీ-పోస్టుమార్టం అనంతరం హత్యగా తేలడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, జ్యోతి ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు.
అయితే, పెళ్లికి ముందే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా అది వివాహేతర సంబంధంగా మారింది. వివాహం అనంతరం కూడా ఇద్దరూ తమ సంబంధాన్ని కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మే 29న స్వామి విధులకు వెళ్లిన సమయంలో నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా గడుపుతుండగా రెండేళ్ల హరికృష్ణ ఏడవడం ప్రారంభించాడు. చిన్నారి ఏడుపుతో తమ సరదాకు భంగం కలిగిందని భావించిన నవీన్ ఆగ్రహానికి గురయ్యాడు. పిల్లాడి ఏడుపు బయటకు వినిపిస్తే సమస్యలు వస్తాయని, వాడిని చంపేద్దామని జ్యోతికి సూచించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రియుడి మోజులో పూర్తిగా మునిగిపోయిన జ్యోతి, నవీన్ మాటలకు తలొగ్గి తన సొంత కుమారుడిపైనే అమానుషంగా ప్రవర్తించింది. రెండేళ్ల చిన్నారి హరికృష్ణ ఏడుస్తుండటంతో అతడిని చేతుల్లోకి తీసుకుని నేలకేసి కొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఘటన అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు బాలుడికి ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ భర్త స్వామితో పాటు కుటుంబ సభ్యులను నమ్మించింది. అనంతరం అంత్యక్రియలను కూడా త్వరితగతిన పూర్తి చేసింది. అయితే కుమారుడి మృతిపై స్వామికి అనుమానాలు రావడంతో భార్యను పలుమార్లు ప్రశ్నించాడు. ఆమె చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసును లోతుగా విచారించిన పోలీసులు చిన్నారి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. రీ-పోస్టుమార్టం నివేదికలో ఇది సహజ మరణం కాదని, హత్యేనని నిర్ధారణ కావడంతో కేసు సంచలన మలుపు తిరిగింది. విచారణలో జ్యోతి పాత్ర బయటపడటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నవీన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కన్నతల్లి చేతిలోనే అమాయక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రియుడి మోజులో మానవత్వాన్ని మరిచిపోయి సొంత బిడ్డనే బలి చేసిన ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీనివాస్ నాయక్
స్టే ట్ బ్యూరో, నిజం న్యూస్



