అక్రమాస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్‌కు ACB షాక్
రూ.13 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు.. నగదు, బంగారం, ఫ్లాట్లు, భూములు స్వాధీనం

హైదరాబాద్, విజం న్యూస్, జూన్ 16:
తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో మల్టీ జోన్-II డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుంకరి నరహరి రావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) వెల్లడించింది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణల ప్రకారం) సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసి మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు సంబంధించిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరం ప్రాంతంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఫ్లాట్, నర్సింగిలో ఒక్కొక్కటి 1,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
అదనంగా గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో జీ+3 భవనం, ఛత్రినాకలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు. సోదాల్లో సుమారు రూ.1.54 కోట్ల నగదు, రూ.2.29 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
అలాగే అధికారిపేరు మీద ఉన్న భార్యకు చెందిన రెండు లాకర్లు గుర్తించగా, వాటిని దర్యాప్తు ప్రక్రియలో తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఒక కియా కేరెన్స్ స్మార్ట్‌స్ట్రీమ్ జీ1.5 6ఎంటి (పెట్రోల్) కారు కూడా గుర్తించినట్లు తెలిపారు.
సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.13,05,67,100గా అంచనా వేయగా, మార్కెట్ విలువ దీనికంటే పలుమార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, నిందిత అధికారిని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, విజం న్యూస్



