అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని భక్తుడు మృతి
గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ (మోక్ష మార్గం) గుహలో ఇరుక్కుపోయిన భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం (24 జూలై 2026) అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.

తిరువణ్ణామలై, జూలై 25 (నిజం న్యూస్):
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ (మోక్ష మార్గం) గుహలో ఇరుక్కుపోయిన భక్తుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం (24 జూలై 2026) అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వర స్వామి, ఉన్నాములయ్యమ్మవారిని దర్శించుకుని అనంతరం గిరిప్రదక్షిణకు వెళ్లాడు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరివలం మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకుని, భక్తులు “మోక్ష మార్గం”గా పిలిచే ఇరుకైన గుహ మార్గంలో ప్రవేశించాడు.
ఈ గుహలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి, అత్యంత ఇరుకైన మార్గంలో పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తారు. స్థానికంగా ఈ మార్గం గుండా వెళ్లడం ఆధ్యాత్మిక అనుభూతికి, పాప విమోచనకు ప్రతీకగా భావిస్తారు. ఈ కారణంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ గుహలోకి ప్రవేశిస్తుంటారు.
అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న స్థానికులు కూడా తీవ్రంగా శ్రమించి ఆయనను బయటకు తీసేలోపు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
అనంతరం 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ ఘటనతో అరుణాచలం భక్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇరుకైన గుహ మార్గంలోకి ప్రవేశించే భక్తులు తమ శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని, ఆలయ నిర్వాహకులు కూడా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో



