పెన్షన్ పని కోసం రూ.15 వేల లంచం.. ఏసీబీ వలలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు
ఫిర్యాదుదారుడి తల్లి నెలవారీ పెన్షన్ మంజూరుకు సంబంధించిన అధికారిక పనుల కోసం రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు పేర్కొంది.

హైదరాబాద్ | సెప్టెంబర్ 22 | నిజం న్యూస్:
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన, సెప్టెంబర్ 21న నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
ఏసీబీ వివరాల ప్రకారం.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాల్డా అశోక్, ఆడిట్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కలకుంట్ల కిరణ్ కుమార్ లు ఫిర్యాదుదారుడి తల్లి నెలవారీ పెన్షన్ మంజూరుకు సంబంధించిన అధికారిక పనుల కోసం రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు పేర్కొంది.
ఫిర్యాదుదారుడి తల్లి సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు చేయడంతో పాటు ఇన్‌క్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేసి పెన్షన్ మంజూరుకు సహకరించేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
సెప్టెంబర్ 21న ఉదయం సుమారు 11.18 గంటలకు, నిజామాబాద్ పట్టణంలోని సీతారామ్‌నగర్ కాలనీ, రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని పద్మశాలి సంగం వద్ద ఏసీబీ నిజామాబాద్ రేంజ్ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరూ పట్టుబడ్డారు. లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
ప్రజలకు ఏసీబీ సూచన
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



