దేవాదాయ భూములపై అధికార నేతల కన్ను

 సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ రామస్వామిగుట్టకు వెళ్లే మార్గంలో భూముల విలువ కోట్లలో పలుకుతుంది. దీంతో కొంతమంది నాయకుల కన్ను దేవాదాయ భూముల పై పడింది. వెంటనే వారు 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 509 సర్వేనెంబర్ లోని భూమిలోకి 281 సర్వే నంబర్‌ ను త్వరపడేలా చేసి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది

281 సర్వే నెంబర్ ను 509 లోకి తెచ్చేందుకు యత్నం

*100 ఏళ్ల పేదల సాగు భూమిని కబ్జా చేసేందుకు యత్నం*..!

*నోటీసులు ఇవ్వకుండానే సర్వే.. ఎందుకో*..?

*కాంగ్రెస్‌ నేతల ధైర్యం వెనుక మంత్రి పీఏ అండ*..?

*మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరు తెరపైకి*..?

హుజూర్‌నగర్‌, సెప్టెంబర్18 (నిజం చెపుతాం):

హుజూర్ నగర్ లోని ఫణిగిరి దేవస్థానం భూములకు రక్షణ కరవవుతోందా..? ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడిందా..? రికార్డుల్లో ఉన్న తేడాలను, పక్క పక్క సర్వే నెంబర్లను ఆసరాగా చేసుకుని దేవాదాయ భూముల్లోకి హద్దులు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ రామస్వామిగుట్టకు వెళ్లే మార్గంలో భూముల విలువ కోట్లలో పలుకుతుంది. దీంతో కొంతమంది నాయకుల కన్ను దేవాదాయ భూముల పై పడింది. వెంటనే వారు 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 509 సర్వేనెంబర్ లోని భూమిలోకి 281 సర్వే నంబర్‌ ను త్వరపడేలా చేసి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రికార్డులను గత రెండు సంవత్సరాల కిందనే వేసినట్లుగా తెలుస్తుంది. అందుకే పాత, ప్రస్తుత రికార్డుల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు రావడం విశేషం. 509 సర్వే నెంబర్ లో2 ఎకరాల 20 కుంటల భూమి రోడ్డు పక్కనే ఉండటంతో ముందుగా దీనిని ఆక్రమించి ఆ తర్వాత దాని వెనుక, పక్కనే ఉన్న 511, 515 సర్వే నంబర్ల దేవాదాయ భూములను కూడా ఆక్రమించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

సర్వేనెంబర్ 281లో లెక్క తేల్చాలి..!

భూమి వివాదానికి కేంద్రంగా మారిన 281 సర్వే నంబర్‌లోనే అసలు చిక్కు ఉందని బాధితులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ రికార్డుల్లో సుమారు 10 ఎకరాల 10 కుంటల భూమి ఉన్నట్లు కనిపిస్తుండగా, ఇతర రికార్డుల్లో మాత్రం 12 ఎకరాలకు పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే సుమారు రెండు ఎకరాల 20 కుంటల భూమిని అదనంగా చేర్చి పక్కన ఉన్న సర్వే నెంబరు లోకి చుట్టుకుని వచ్చేలా ముందుగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకే సర్వే నంబర్‌కు సంబంధించి విస్తీర్ణం విషయంలో ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది? ఏ రికార్డు ఆధారంగా భూమి లెక్కలు మారాయి? ఎప్పుడు మారాయి? ఎవరి ఆదేశాలతో మారాయి? అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.

ఎన్ ఎస్ పి కాలువ భూమి చేతులు మారిందా..?

281 సర్వేనెంబర్ భూమిలో కొంత భాగం గతంలో ఎన్ ఎస్ పి కాలువ పరిధిలోకి డొంక రోడ్డు పరిధిలో పోయినట్లు తెలుస్తుంది అయితే రికార్డులు మాత్రం అది అలాగే కొనసాగుతున్నట్లుగా రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అదే భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజూర్నగర్ పట్టణానికి చెందిన 3 వ్యక్తులకు ఒక్కొక్కరికి సుమారు 31 కుంటల చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. కాలువకు వెళ్లిన భూమి తిరిగి ఎలా రిజిస్ట్రేషన్‌కు వచ్చింది? ఆ భూమికి హక్కులు ఎలా ఏర్పడ్డాయి? రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏ పత్రాలను పరిశీలించారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి.

పక్కనే దేవాదాయ భూమి.. ఇదే అదనుగా..?

281 సర్వే నంబర్‌కు ఆనుకుని 511, 515 సర్వే నంబర్లలో దేవాదాయ శాఖ భూములు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో 281 భూమి విషయంలో తలెత్తిన రికార్డుల గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని దేవాదాయ భూముల్లోకి కూడా హద్దులు విస్తరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.దశాబ్దాలుగా శిస్తు చెల్లిస్తూ సాగు చేస్తున్న భూమి విషయంలో హక్కులు మారుస్తూ, పక్కనే ఉన్న దేవాదాయ భూమిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌ నేతల పైనే ఆరోపణలు..!

ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్‌ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భూమి వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు ఓ మంత్రి పీఏ అండగా ఉన్నారనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. మంత్రి పీఏ పేరు ఈ భూ వివాదంలో ఎందుకు వస్తోంది? ఆయనకు ఈ వ్యవహారంతో ఉన్న సంబంధం ఏమిటి? కాంగ్రెస్‌ నాయకులకు ఏమైనా సహకారం అందుతోందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హస్తముందా..?

మరోవైపు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నాయకులకు ఆయన సహకరిస్తున్నారని, భూమి వ్యవహారంలో తన రాజకీయ పరిచయాలను ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

మంత్రి పీఏ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేర్లు ఒకే భూ వివాదంలో వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

కౌలు రైతులకు నోటీసులు లేకుండానే సర్వేలు.. ఎందుకో..?

కౌలు రైతులకు ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే హడావుడిగా సర్వేలకు అధికారులు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా భూముల హద్దులు, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉండగా.. ఇంత తొందరగా సర్వేలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు కౌలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో మంత్రి పీఏ తరచూ ఫోన్‌ కాల్స్‌ చేస్తూ దేవాదాయ శాఖ ఈవోను, రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా స్థానికంగా చర్చకు వస్తున్నాయి. అసలు మంత్రి పీఏ ఎందుకు పదేపదే ఫోన్‌ చేస్తున్నారు? సర్వే విషయంలో ఎలాంటి ఆదేశాలు లేదా సూచనలు అందుతున్నాయి? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

దేవస్థాన భూములు.. లెక్కలెక్కడ..?

శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సుమారు 684 ఎకరాల 18 గుంటల భూమి ఉన్నట్లు స్థానిక వివరాలు చెబుతున్నాయి. ఇందులో వివిధ ప్రభుత్వ అవసరాలు, ఇతర కేటాయింపుల కింద కొంత భూమి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. 2012లో గృహ నిర్మాణ శాఖకు సుమారు 51.9 ఎకరాల 9 గుంటలు ఇచ్చినట్లు, వృద్ధాశ్రమం కోసం సుమారు 12 ఎకరాలు, ఎన్‌ఎస్‌పీ కాలువలు, గుట్టల పరిధిలో మరో 86 ఎకరాలు తదితర భూములు వినియోగంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.అయితే ప్రస్తుతం దేవస్థానం ఆధీనంలో వాస్తవంగా ఎంత భూమి ఉంది? కాగితాల్లో ఎంత ఉంది? క్షేత్రస్థాయిలో ఎంత ఉంది? ఇతరుల ఆధీనంలో ఉన్న భూమి ఎంత? అన్న లెక్కలు తేలాల్సి ఉంది.

సర్వే చేస్తే.. అసలు రంగు బయటపడేనా?

281, 509, 511, 515 సర్వే నంబర్లకు సంబంధించి పాత రికార్డులు, ప్రస్తుత ఆన్‌లైన్‌ వివరాలు, సర్వే మ్యాపులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, దేవాదాయ శాఖ రికార్డులు, శిస్తు రసీదులను ఒకేసారి పరిశీలిస్తే వివాదానికి తెరపడే అవకాశం ఉంది.రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? రికార్డుల్లో మార్పులు జరిగాయా? కాలువ భూమి తిరిగి ఎలా రిజిస్టర్‌ అయింది? దేవాదాయ భూముల హద్దులు ఎవరు మార్చారు? ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కుటుంబాన్ని ఎందుకు ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోంది? అనే ప్రశ్నలకు అధికారిక విచారణే సమాధానం చెప్పాల్సి ఉంది.

దేవుడి భూములకు అధికార పార్టీ నాయకుల గ్రహణం..?

దేవాదాయ భూములను పరిరక్షించాల్సిన అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ నాయకుల జోక్యం, మంత్రి పీఏ పేరు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాత్రపై వస్తున్న ఆరోపణలపైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రికార్డులు బయటకు తీసి హద్దులు నిర్ధారిస్తే ఎవరి భూమి ఎంత.. ఎవరి హక్కు ఎంత.. అన్నది తేలిపోతుందని స్థానికులు చెబుతున్నారు.

 

100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. శిస్తు కడుతున్నాం..!

ములకలపల్లి సామ్రాజ్యం..(కౌలు రైతు హుజూర్‌నగర్‌)

మా కుటుంబానికి వారసత్వంగా వచ్చిన దేవాలయ భూమిని 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. దేవాదాయ శాఖకు శిస్తు కూడా కడుతున్నాం. గత మూడు నెలలుగా కొందరు రాజకీయ నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక కౌన్సిలర్‌ డోజర్‌ను మా పొలంలోకి పంపి సరి చేయించాలని చూస్తున్నాడు. మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మా భూమిని కాపాడి న్యాయం చేయాలి.

509 సర్వే నంబర్‌ భూములు దేవాలయానివే.. ఈవో కొండారెడ్డి(హుజూర్ నగర్)

509 సర్వే నంబర్‌లోని భూములు సుమారు 100 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అవి దేవాలయ భూములే. రైతులు ఇన్నేళ్లుగా దేవాలయానికి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించామని చెప్పారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న భూములను పూర్తిగా పరిశీలించాలి. వారం రోజుల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన మొత్తం భూమిని సర్వే చేయించాలని నిర్ణయించాం. సర్వే పూర్తయితే ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది, దాని హద్దులు ఏంటి అన్నది స్పష్టంగా తెలుస్తుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button