ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్‌తో టీచర్ ఉద్యోగం.. సర్టిఫికెట్లు రద్దు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్!

నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లు తేలడంతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక చర్యలు తీసుకున్నారు. సంబంధిత సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నిజం న్యూస్ | మే 28, 2026

తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ మహిళా టీచర్ వ్యవహారం మెదక్ జిల్లాలో సంచలనంగా మారింది.

నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లు తేలడంతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక చర్యలు తీసుకున్నారు. సంబంధిత సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

*అసలేం జరిగిందంటే..?*

 

2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో బీసీ-ఈ కేటగిరీ కింద ఐదు ఎస్జీటీ పోస్టులు కేటాయించబడ్డాయి. టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన దూదేకుల సనాబేగం అనే అభ్యర్థి బీసీ-ఈ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ ధృవీకరణ పత్రాల ఆధారంగా టీచర్ ఉద్యోగాన్ని పొందారు. ప్రస్తుతం ఆమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

 

*ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజం!*

 

సనాబేగం నిజానికి బీసీ-బి కేటగిరీకి చెందిన దూదేకుల సామాజిక వర్గానికి చెందినవారని, కానీ తప్పుడు మార్గంలో బీసీ-ఈ (షేక్ సామాజిక వర్గం) సర్టిఫికెట్ పొందారని పాపన్నపేట మండలానికి చెందిన మహమ్మద్ నవాజ్ అనే మరో అభ్యర్థి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో కూడిన ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు.

 

*కలెక్టర్ యాక్షన్..!*

 

ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించారు. విచారణలో సనాబేగం సమర్పించిన క్యాస్ట్, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లు తప్పుడు సమాచారం ఆధారంగా పొందినట్లు నిర్ధారణ కావడంతో, అధికారులు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీంతో స్పందించిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం రోజున సంబంధిత సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

అర్హులైన అభ్యర్థుల అవకాశాలను హరించి అక్రమంగా ఉద్యోగాలు పొందే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button