మానుకోట ముద్దుబిడ్డ.. 12 ఏళ్లకే క్రికెట్‌లో సంచలనం.. 124 పరుగులతో అదరగొట్టిన గిరిజన బాలుడు!

హెచ్‌సీఏ సీ డివిజన్ వన్డే లీగ్‌లో లునావత్ సాయి హర్షిత్ అద్భుత ప్రతిభ.. తండ్రి రాములు ప్రోత్సాహంతో క్రికెట్‌లో దూసుకెళ్తున్న బాలుడు

హెచ్‌సీఏ సీ డివిజన్ వన్డే లీగ్‌లో లునావత్ సాయి హర్షిత్ అద్భుత ప్రతిభ.. తండ్రి రాములు ప్రోత్సాహంతో క్రికెట్‌లో దూసుకెళ్తున్న బాలుడు

మహబూబాబాద్, నవంబర్ 27 | నిజం న్యూస్

చిన్న వయసులోనే క్రికెట్‌లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ మహబూబాబాద్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల గిరిజన బాలుడు లునావత్ సాయి హర్షిత్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ డివిజన్ వన్డే లీగ్ టోర్నమెంట్ 2026–27లో భాగంగా నవంబర్ 26న జరిగిన మ్యాచ్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో సత్తా చాటాడు.

హైదరాబాద్‌కు చెందిన ఎలెవన్ మాస్టర్స్ జట్టు తరఫున ఆడుతున్న సాయి హర్షిత్.. అద్నాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 124 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 132 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఈ స్థాయి క్రికెట్ పోటీల్లో ఇలాంటి ప్రతిభ కనబరచడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఎలెవన్ మాస్టర్స్ జట్టు 50 ఓవర్లలో 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాయి హర్షిత్ అద్భుత ఇన్నింగ్స్‌తో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. అతని ప్రతిభను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేకంగా ప్రచురించడం విశేషం.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు పరిధిలోని గోలు బోడక తండాకు చెందిన రాములు కుమారుడు లునావత్ సాయి హర్షిత్. మారుమూల గిరిజన తండా నుంచి హైదరాబాద్ క్రికెట్ మైదానం వరకు తన ప్రతిభతో ఎదుగుతున్న ఈ బాలుడు స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.

తండ్రి ప్రోత్సాహం.. తనయుడి ప్రతిభకు తోడ్పాటు!

సాయి హర్షిత్ క్రికెట్‌లో ముందుకు సాగడానికి తండ్రి రాములు అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి. చిన్న వయసులోనే కుమారుడిలోని క్రీడా ఆసక్తిని గుర్తించి అతడిని ప్రోత్సహిస్తూ క్రికెట్‌లో రాణించేందుకు తండ్రి అందిస్తున్న అండదండలు అభినందనీయం. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోగలరనడానికి సాయి హర్షిత్ ప్రయాణం నిదర్శనంగా నిలుస్తోంది.

మారుమూల గిరిజన తండాకు చెందిన బాలుడు హైదరాబాద్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో 124 పరుగులు సాధించి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో చోటు సంపాదించడం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానుల్లో ఆనందం నింపుతోంది.

భవిష్యత్తులో మరింత మెరుగైన శిక్షణ, తగిన అవకాశాలు లభిస్తే సాయి హర్షిత్ రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతిభతో కుటుంబానికి, స్వగ్రామానికి, మానుకోట జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button