దుమ్ము.. ధూళి.. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి!
ఈ నెల 10న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి.. జిల్లా వ్యాప్తంగా ‘చలో మణుగూరు’కు పిలుపు

మణుగూరు బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపు
మణుగూరు, అక్టోబర్ 7 (నిజం చెపుతాం):
బొగ్గు టిప్పర్లు, ఇసుక లారీల రాకపోకలతో మణుగూరు పట్టణం దుమ్ము, ధూళి, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న మణుగూరు బంద్‌కు పిలుపునిచ్చారు. అదే రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
మణుగూరు ప్రధాన రహదారులపై భారీ వాహనాల రాకపోకలతో విపరీతంగా దుమ్ము పేరుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నాయకులు మండిపడ్డారు. ఒకవైపు సింగరేణి బొగ్గు టిప్పర్లు, మరోవైపు ఇసుక ర్యాంపులకు రాకపోకలు సాగించే భారీ లారీల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అక్రమ ఇసుక దందాపై విచారణ జరపాలి
అక్రమ ఇసుక దందాకు కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారిని ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
మణుగూరును అభివృద్ధి చేస్తారా.. కాలుష్యంలో ముంచుతారా?
“ప్రజా పాలనలో మణుగూరును అభివృద్ధి చేస్తారా? లేక దుమ్ము, ధూళి, కాలుష్యం, అక్రమ దందాలతో ముంచేస్తారా?” అని నాయకులు ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
రోడ్లను నిరంతరం శుభ్రం చేయాలి
మణుగూరు ప్రధాన రహదారులను సింగరేణి సంస్థ ఔట్‌సోర్సింగ్ కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని నాయకులు కోరారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లపై పేరుకుపోతున్న దుమ్మును నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అనుమతులు ఎలా లభించాయనే అంశంపైనా నాయకులు ప్రశ్నలు సంధించారు. సంబంధిత శాఖల అనుమతులు, కోర్టు ఆదేశాలు, రహదారి నిర్మాణ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఎన్జీటీని ఆశ్రయిస్తాం
పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న సింగరేణి, ఇసుక ర్యాంపుల వ్యవహారంపై ఆధారాలతో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ను ఆశ్రయిస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
ఈ నెల 10న నిర్వహించనున్న మణుగూరు బంద్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
మణుగూరును దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. మణుగూరును కాపాడే వరకు పోరాటం కొనసాగుతుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదు” అని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోశం నరసింహారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు కుంట లక్ష్మణ్, వట్టం రాంబాబు, ముద్దంగుల కృష్ణ, అడపా అప్పారావు, తురక రామకోటి, జావిద్, ఆవుల నరసింహారావు, బోశెట్టి రవి, సృజన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.



