భార్యలో ఇంతటి కిరాతకత్వమా? ప్రియుడితో కలిసి భర్త హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణకు విఫలయత్నం
నిద్రమాత్రలు ఇచ్చి భర్తను గాఢ నిద్రలోకి పంపించి, ఆపై ఇనుప రాడ్, రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నిజం న్యూస్ | ఆగస్టు 13, 2026 | పీలేరు
పీలేరు: అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగుచూసిన భర్త హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. బయటకు ఎంతో అమాయకంగా కనిపించే ఉమాదేవి.. తన భర్తను హత్య చేయడానికి ప్రియుడితో కలిసి పథకం రచించిందని పోలీసులు వెల్లడించడం స్థానికంగా కలకలం సృష్టించింది. నిద్రమాత్రలు ఇచ్చి భర్తను గాఢ నిద్రలోకి పంపించి, ఆపై ఇనుప రాడ్, రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పీలేరు డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉమాదేవికి చంద్రగిరి మండలానికి చెందిన 32 ఏళ్ల చారాల సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం రెండేళ్లుగా వివాహేతర సంబంధంగా కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.
భర్త అడ్డుగా ఉన్నాడని..
తమ సంబంధానికి భర్త వెంకట సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి.. ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యంతో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు 7న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ప్రియుడు ఇచ్చిన నిద్రమాత్రలను ఉమాదేవి ఇడ్లీ, సాంబార్, చట్నీలో కలిపి భర్తకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. భోజనం చేసిన కొద్దిసేపటికే వెంకట సుబ్రహ్మణ్యం గాఢ నిద్రలోకి వెళ్లాడు.
రాత్రి సుమారు 11.30 గంటలకు చారాల సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించిన ఉమాదేవి.. అతనితో కలిసి నిద్రిస్తున్న భర్తపై ఇనుప రాడ్, గుండ్రాయితో తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో వెంకట సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
మృతదేహాన్ని రోడ్డుపై పడేసి..
హత్య విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 8 తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు చారాల సుబ్రహ్మణ్యానికి చెందిన హోండా యాక్టివాపై మృతదేహాన్ని తరలించి మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే వెంకట సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు నమ్మించేలా ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు తెలిపారు.
హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, గుండ్రాయి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను గోనె సంచిలో కట్టి సమీపంలోని కుంటలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మామ అనుమానంతో బయటపడిన మిస్టరీ
అయితే ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించకుండా మృతుడి తండ్రి మంగినేని క్రిష్టయ్య అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడిది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, ఇందులో ఏదో కుట్ర ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంతకాలంగా కోడలు ఉమాదేవి ప్రవర్తనలో మార్పు కనిపించిందన్న క్రిష్టయ్య అనుమానం పోలీసుల దర్యాప్తుతో నిజమైంది.
ఫిర్యాదు ఆధారంగా పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలను సేకరించి అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. చివరకు ఉమాదేవి, చారాల సుబ్రహ్మణ్యం ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపారు.
ఇద్దరి అరెస్ట్.. కోర్టులో హాజరు
కేసులో నిందితులుగా ఉన్న ఉమాదేవి (A-1), చారాల సుబ్రహ్మణ్యం (A-2)లను ఆగస్టు 11 సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దర్యాప్తుకు ఎస్పీ అభినందనలు
ఈ కేసును వేగంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు. రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో పీలేరు సీఐ జి. వెంకటేశ్వర్లు, కలకడ సీఐ బి. లక్ష్మన్న, ఎస్‌ఐ రహీం తదితర సిబ్బంది దర్యాప్తులో భాగస్వాములయ్యారు. ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేసినట్లు సమాచారం.
అమాయకత్వం వెనుక దాగిన హత్యా కుట్ర
ఈ ఘటనలో అత్యంత కలచివేసే అంశం.. సుమారు రెండు దశాబ్దాల వైవాహిక బంధం తర్వాత భర్తను హత్య చేసేందుకు భార్యే ప్రియుడితో కలిసి పథకం రచించిందన్న ఆరోపణలు. అంతేకాకుండా హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రోడ్డుపై పడేయడం, ఇంట్లోని ఆధారాలను తొలగించడం వంటి చర్యలు కేసు తీవ్రతను తెలియజేస్తున్నాయి.
అయితే నిందితులపై నమోదైన ఆరోపణలు, దర్యాప్తులో లభించిన ఆధారాలు, తదుపరి న్యాయ ప్రక్రియలో కోర్టు తుది నిర్ణయం కీలకం. పోలీసులు వెల్లడించిన వివరాల ఆధారంగానే ఈ కథనం రూపొందించబడింది.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



