దుష్ప్రచారాలపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన సింగర్ మంగ్లీ..!
వారి వల్ల సమాజంలో వ్యక్తుల గౌరవానికి భంగం కలుగుతోంది..

ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి)నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆమె కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
బాధితులకు అండగా నిలవాలని, తప్పుడు ప్రచారాల వల్ల కలిగే మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని ఆమె సీపీని విజ్ఞప్తి చేశారు.
తప్పుడు ప్రచారాలు చేసే వారి వల్ల సమాజంలో వ్యక్తుల గౌరవానికి భంగం కలుగుతోంది. నిజనిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన సీపీ సజ్జనార్, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.



