మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖకు రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్‌ను వెంటనే నియమించాలి: బోడ రమేష్ నాయక్
మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖకు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించకుండా డిప్యూటేషన్ అధికారులతోనే శాఖను నిర్వహిస్తున్నారని, దీంతో శాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ ఆరోపించారు.

మహబూబాబాద్ | 18 జూలై 2026 | నిజం న్యూస్
మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖకు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించకుండా డిప్యూటేషన్ అధికారులతోనే శాఖను నిర్వహిస్తున్నారని, దీంతో శాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ ఆరోపించారు.
మహబూబాబాద్ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జిల్లాగా ఉన్నప్పటికీ, గిరిజన సంక్షేమ శాఖలో శాశ్వత డిప్యూటీ డైరెక్టర్ లేకపోవడం వల్ల పరిపాలన పూర్తిగా దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, హెచ్‌ఎంల అక్రమ డిప్యూటేషన్లు, వర్కర్ల కాంటింజెంట్ నియామకాల్లో అవకతవకలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, కనీస పర్యవేక్షణ కూడా లేకుండా విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారుల పర్యవేక్షణ ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థాలకే పరిమితమైందని ఆరోపించారు.
గిరిజన సంక్షేమ శాఖలో పారదర్శకత, సమర్థవంతమైన పరిపాలన కోసం మహబూబాబాద్ జిల్లాకు వెంటనే రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించాలని బోడ రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్