బీఆర్‌ఎస్‌కు మల్లారెడ్డి గుడ్‌బై?.. కాంగ్రెస్ వైపు అడుగులా? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ కూడా “మల్లన్నా.. మౌనమేల?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

నిజం న్యూస్, జూలై 20, 2026:
బీఆర్‌ఎస్ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీని వీడనున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఘట్‌కేసర్‌లో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు మల్లారెడ్డి హాజరుకావడం, సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై సీఎం చేసిన విమర్శలపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ కూడా “మల్లన్నా.. మౌనమేల?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
మరోవైపు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంపై మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నియోజకవర్గ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వారు కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇక గతంలో తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని మల్లారెడ్డి కలవడం కూడా రాజకీయ చర్చకు కారణమైంది. విద్యాసంస్థల విస్తరణ కోసమే ఈ భేటీ అని ఆయన సన్నిహితులు చెప్పినా, బీజేపీలో చేరికపై ఊహాగానాలు వినిపించాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంతోనూ ఆయనకు సంప్రదింపులు జరిగాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరే అవకాశముందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.
అయితే ఈ ప్రచారాలపై మల్లారెడ్డి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



