సాఫ్ట్‌వేర్ ఫుల్‌టైం.. సైబర్ క్రైమ్ పార్ట్‌టైం!

తక్కువ వడ్డీ లోన్ పేరుతో మోసం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్ – మరో నలుగురి కోసం గాలింపు

నిజం న్యూస్ | హైదరాబాద్ | జూలై 19, 2026

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్ ఇప్పిస్తామని సోషల్ మీడియా ద్వారా అమాయకులను నమ్మించి డబ్బులు కాజేస్తున్న కేసులో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ తలారి ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

 

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా కనిపించిన “తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్” అనే ప్రకటనపై క్లిక్ చేశాడు. అనంతరం నిందితులు వాట్సాప్ కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ఈఎంఐ, సర్వీస్ చార్జీలు తదితర పేర్లతో విడతల వారీగా రూ.17,951 వసూలు చేశారు.

 

డబ్బులు చెల్లించినప్పటికీ రుణం మంజూరు కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవీణ్ ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఇదే తరహాలో మరో 30 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

 

దర్యాప్తులో నిందితులు నకిలీ లోన్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ కాల్స్ ద్వారా ప్రజలను నమ్మించి ముందస్తు చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు ఆకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నలుగురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

 

పోలీసుల సూచనలు:

ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే తక్కువ వడ్డీ లోన్ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని, ముందస్తు ఫీజులు చెల్లించాలని కోరే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button