కేజీబీవీల్లో వరుస టర్మినేషన్లు.. ఎస్‌ఓ సరస్వతి వివరణతో కొత్త మలుపు

విద్యార్థినిపై దాడి విషయం కాదు.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర చర్యలు: నిజం న్యూస్‌ను సంప్రదించిన ఎస్‌ఓ సరస్వతి

మహబూబాబాద్, సెప్టెంబర్ 25 | నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్లపై వరుసగా తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కురవి మండలం నేరడ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరస్వతిపై తీసుకున్న టర్మినేషన్ చర్యలపై ఆమె నిజం న్యూస్‌ను సంప్రదించి తన వివరణను వెల్లడించారు. తనపై వచ్చిన కొన్ని ఆరోపణలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర వైద్యం

ఓ విద్యార్థినికి రుతుస్రావం అధికంగా కావడంతో ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని సరస్వతి తెలిపారు.

పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న వారి సహకారంతో ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి ప్రాథమిక వైద్యం అందించామని ఆమె వివరించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో తక్షణ వైద్య సహాయం అందించడం తప్పనిసరి పరిస్థితిగా భావించామని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తనపై చర్యలు తీసుకున్నారని సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడో తరగతి విద్యార్థినుల ఘటనను జీసీడీఓకు తెలియజేశాను

ఏడో తరగతి విద్యార్థినులను సీఆర్‌టీ కొట్టిన విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే, విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఘటనను జీసీడీఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సరస్వతి తెలిపారు.

ఈ అంశాన్ని కూడా ప్రస్తుత వ్యవహారంలో పూర్తిగా పరిశీలించి, తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

టర్మినేషన్‌ను పునఃపరిశీలించాలి

తనపై తీసుకున్న టర్మినేషన్ ఉత్తర్వులను పునఃపరిశీలించాలని సరస్వతి విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన సమయంలో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, అప్పటి పరిస్థితులు, తాను తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఏళ్లుగా కేజీబీవీలో విధులు నిర్వహిస్తూ విద్యార్థినుల విద్య, సంక్షేమం కోసం పనిచేశానని పేర్కొన్న ఆమె.. తన వివరణను పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

జీసీడీఓపై గత వ్యవహారాల ఆరోపణలు

ఇదిలా ఉండగా, ప్రస్తుతం జీసీడీఓగా ఉన్న అధికారిపై గతంలో నేరడ కేజీబీవీలో ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు వచ్చినట్లు కొందరు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ సమయంలో కేజీబీవీ నిధుల వినియోగం, విద్యార్థినులకు కేటాయించిన పాలు, కూరగాయలు, పప్పు దినుసుల విషయంలో ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అలాగే బయ్యారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన సమయంలో విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అదే అధికారి జీసీడీఓగా ఉండి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లపై వరుస చర్యలు తీసుకోవడంపై పలువురు ఎస్‌ఓలు ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు సమాచారం.

కొత్తూరు(సి) పాఠశాల వ్యవహారంపైనా ఆరోపణలు

కురవి మండలం కొత్తూరు(సి) ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన సమయంలో విద్యార్థుల ద్వారా వారి ఇళ్ల నుంచి కూరగాయలు, పప్పు దినుసులు తెప్పించుకునేవారని, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారనే ఆరోపణలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

తనిఖీల తీరుపైనా ఎస్‌ఓల అభ్యంతరాలు

కేజీబీవీల తనిఖీల సందర్భంగా కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడం, తనిఖీల అనంతరం స్పెషల్ ఆఫీసర్లకు ఫోన్ కాల్స్ రావడం వంటి అంశాలపై కూడా ఎస్‌ఓలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

తనను 30 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకుంటూ ఫోన్ ద్వారా ఒత్తిడి తెచ్చారని, తమ విషయాలు తాను చూసుకుంటానని హెచ్చరించినట్లు కొందరు ఎస్‌ఓలు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.

గార్ల, నేరడ ఎస్‌ఓల టర్మినేషన్లపై పునఃపరిశీలనకు డిమాండ్

ఈ విద్యా సంవత్సరంలో గార్ల కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌ను టర్మినేట్ చేయడం, తాజాగా నేరడ కేజీబీవీ ఎస్‌ఓ సరస్వతిపై చర్యలు తీసుకోవడం, డోర్నకల్ కేజీబీవీ ఎస్‌ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయడం వంటి పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

తమపై చర్యలు తీసుకునే ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి, సంబంధిత స్పెషల్ ఆఫీసర్లకు తమ వాదన వినిపించే అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

నేరడ కేజీబీవీ ఎస్‌ఓ సరస్వతి మాత్రం తనపై తీసుకున్న టర్మినేషన్‌ను పునఃపరిశీలించి, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, ఏడో తరగతి విద్యార్థినులను సీఆర్‌టీ కొట్టిన విషయాన్ని తాను జీసీడీఓకు తెలియజేసిన అంశం సహా ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను పరిశీలించిన అనంతరం తనను తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించి, ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించి, సంబంధిత అన్ని వర్గాల వివరణలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి.

_శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button