నేడు రైతుల ఖాతాల్లోకి రెండో విడత ‘రైతు భరోసా’ నిధులు జమ

45 లక్షల మందికి రూ.2,206 కోట్లు విడుదల!

 

వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నేడు రెండో విడత నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది రెండు విడతల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.12 వేల రూపాయలను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.

 

ఇప్పటికే రబీ సీజన్‌కు సంబంధించి తొలి విడతలో భాగంగా ఎకరం లేదా అంతకన్నా తక్కువ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడతగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

 

నేడు భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.2,206 కోట్లను విడుదల చేయనున్నారు. దీంతో రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.5,653 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు అందనున్నాయి.

 

ఇక మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. మూడో విడతలో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే మూడు విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల నిధులను జమ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టే అవుతుంది.

 

రెండో విడతలో రైతు భరోసా నిధులు జమ కాని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ లేదా రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి భూమి పట్టా మరియు అవసరమైన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో తదుపరి విడతల్లో నిధులు జమ అవుతాయి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button