రూ.30 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పట్టివేత

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు

జగిత్యాల, ఆగస్టు 14, 2026 | నిజం న్యూస్

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 13) చోటుచేసుకుంది. తెలంగాణ ఏసీబీ అధికారిక సమాచారం ప్రకారం, బీర్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మంచికట్ల రాహుల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఫిర్యాదుదారుడి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్‌ జారీకి అవసరమైన నివేదిక ఇవ్వడానికి అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు రాహుల్ తొలుత రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించేందుకు అంగీకరించారు. అందులో భాగంగా గురువారం రూ.30 వేలు, పని పూర్తయిన తర్వాత మరో రూ.10 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రూ.30 వేలు స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు దాడి చేసి రాహుల్‌ను పట్టుకున్నారు.

ఆయన వద్ద నుంచి రూ.30 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

శ్రీనివాస్ నాయక్ – స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button