వియత్నాంలో ఘోర విషాదం.. టూరిస్ట్ బోటు బోల్తా – 15 మంది మృతి, తెలుగు రాష్ట్రాల పర్యాటకులపై తీవ్ర ఆందోళన
బోటులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది ఉండగా, మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులుగా తెలుస్తోంది. వీరంతా ఒక ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీ నిర్వహించిన ప్రోత్సాహక విదేశీ పర్యటనలో భాగంగా వియత్నాంకు వెళ్లిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు.

నిజం న్యూస్, జూలై 11:
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వోక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో, హోన్ మే రుట్ న్గోయ్ (Hon May Rut Ngoai) ద్వీపానికి సమీపంలోని సముద్ర జలాల్లో శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఘోర టూరిస్ట్ బోటు ప్రమాదం చోటుచేసుకుంది. మొబైల్ డిస్ట్రిబ్యూటర్ల బృందంతో విహారయాత్రకు బయలుదేరిన టూరిస్ట్ స్పీడ్‌బోటు భారీ అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటు హోన్ మే రుట్ న్గోయ్ ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది ఉండగా, మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులుగా తెలుస్తోంది. వీరంతా ఒక ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీ నిర్వహించిన ప్రోత్సాహక విదేశీ పర్యటనలో భాగంగా వియత్నాంకు వెళ్లిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫు క్వోక్ స్పెషల్ ఎకానమిక్ జోన్ అధికారులు, సరిహద్దు రక్షక దళాలు, నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇతర పర్యాటక పడవలు కూడా వెంటనే రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించేందుకు సహకరించాయి.
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం నేవీ, కోస్ట్‌గార్డ్, రెస్క్యూ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందినట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతులు, గల్లంతైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భారత రాయబార కార్యాలయం వియత్నాం అధికారులతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
ప్రమాదానికి కారణమేంటి..?
ప్రాథమిక సమాచారం ప్రకారం సముద్రంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో టూరిస్ట్ స్పీడ్‌బోటు అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు బోటు లోపలే చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు వియత్నాం అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం వెల్లడికానుంది.
బాధితుల సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు:
📞 +84 36281 7930
📞 +84 91552 3714
📞 +84 33452
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



