మద్యం మత్తులో వేధింపులు.. భర్తను కట్టేసి కర్రతో కొట్టి హత్య!
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజం

నిజం న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 18: మద్యం మత్తులో భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో ఆగ్రహించిన భార్య అతడిని హత్య చేసి, ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన పీర్జాదిగూడలో వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో భార్యే హత్యకు పాల్పడినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. సోమవారం ఆమెను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మేడిపల్లి ఇన్స్పెక్టర్ జలేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో రోజువారీ కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య సునీత (44)తో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
భర్త మద్యం సేవించి తరచూ మానసికంగా వేధిస్తుండటాన్ని భరించలేకపోయిన సునీత ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో సత్యనారాయణ చేతులు, కాళ్లను చీరతో కట్టేసి, కర్రతో తీవ్రంగా కొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
అనంతరం సునీత తన కుమారుడికి ఫోన్ చేసి.. సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తొలుత బోడుప్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంచనామా, సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించగా సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు చెప్పిన విషయం అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని విచారించగా.. భర్తను తానే కట్టేసి కర్రతో కొట్టినట్లు వెల్లడైనట్లు సమాచారం. దీంతో హత్య కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
భర్త మద్యం వ్యసనం, వేధింపులతో విసిగిపోయి భార్య ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాస్ నాయక్ – స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



